#Uncategorized

NARENDRA MODI – ఆదివాసీలను పట్టించుకోని కాంగ్రెస్‌..

మధ్యప్రదేశ్‌లో ఆదివాసీల సంక్షేమం కోసం కాంగ్రెస్‌ కృషి చేయలేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం విమర్శించారు. రాష్ట్రంలో తమ కుమారులకు ప్రాధాన్యం కల్పించడానికి, పార్టీని తమ గుప్పిట్లో పెట్టుకునేందుకు ఇద్దరు కాంగ్రెస్‌ నేతలు కమల్‌నాథ్‌, దిగ్విజయ్‌సింగ్‌ కలహించుకుంటూనే ఉంటారని ఆరోపించారు. ‘రాముడిని పురుషత్తముడిని చేసిన గిరిజనులకు మేం శిష్యులం, వారి ఆరాధకులం’ అని మోదీ శివనీ జిల్లాలో జరిగిన ఓ ఎన్నికల ర్యాలీలో పేర్కొన్నారు. కుంభకోణాలు జరగకుండా చేయడంతో ఆదా అయిన నగదుతోనే గరీబ్‌ కల్యాణ్‌ అన్న యోజన అమలు చేస్తున్నామని తెలిపారు. కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ఆ రాష్ట్రాన్ని నాశనం చేసిందని ఖండ్వాలో జరిగిన మరో ర్యాలీలో మోదీ విమర్శించారు. అక్కడ అభివృద్ధి నిలిచిపోయిందని, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంతకాలం పదవిలో ఉంటారో తెలియదని సందేహం వ్యక్తం చేశారు. రాజస్థాన్‌లో కూడా అధికార కాంగ్రెస్‌లో రెండు వర్గాల మధ్య పోరు నడుస్తోందని తెలిపారు. కాంగ్రెస్‌ అవినీతిలో కూరుకుపోయిందని ఆ పార్టీ ఎక్కడ అధికారంలో ఉంటే అక్కడ విధ్వంసం సృష్టిస్తుందన్నారు. వచ్చే లోక్‌సభ ఎన్నికలకు అవసరమైన నిధుల కోసం మధ్యప్రదేశ్‌ను ఏటీఎంగా మార్చుకోవాలని కాంగ్రెస్‌ భావించిందని ప్రధాని మోదీ ఆరోపించారు. భాజపా ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాల వల్లే భారత్‌లో మొబైల్‌ ఫోన్లు, మొబైల్‌ డేటా తక్కువ ధరకే లభిస్తున్నాయని అన్నారు. జనరిక్‌ ఔషధ కేంద్రాల ద్వారా 80 శాతం డిస్కౌంట్‌తో ఔషధాలు విక్రయించడం వల్ల ప్రజలు సుమారు రూ.25,000 కోట్లు ఆదా చేసుకున్నారని తెలిపారు.

అద్భుత మిజోరం నిర్మాణానికి భాజపాకు మద్దతు, ఆశీర్వాదం అందించాలంటూ ఆ రాష్ట్ర ప్రజలకు ప్రధాని మోదీ ఆదివారం విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో శాసనసభ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఆ రాష్ట్ర పౌరులను ఉద్దేశించి మోదీ ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. రాష్ట్రంలో రైల్వేలు, ఆరోగ్యం, క్రీడలు సహా వివిధ రంగాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి భాజపా నేతృత్వంలోని కేంద్రం అనేక చర్యలు చేపట్టిందని వివరించారు. మిజోరం రాష్ట్ర ప్రజలను తన కుటుంబ సభ్యులుగా అభివర్ణించారు. 

Leave a comment

Your email address will not be published. Required fields are marked *