Maxwell – ఇన్నింగ్స్ వెనుక నిక్

ప్రపంచకప్ చరిత్రలోనే అత్యంత చిరస్మరణీయ ఇన్నింగ్స్‌తో అదరగొట్టిన గ్లెన్ మ్యాక్స్‌వెల్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. అయితే కనీసం క్రీజులో నిల్చోడానికే ఇబ్బంది పడిన మ్యాక్స్‌వెల్‌ను ఇన్నింగ్స్ కొనసాగించేలా చేసింది మాత్రం ఫిజియో నిక్ జోన్స్ సలహానే. మంగళవారం అఫ్గానిస్థాన్‌తో మ్యాచ్‌లో కాళ్లు పట్టేయడం.. తీవ్రమైన తిమ్మిర్లతో బాధపడిన మ్యాక్స్‌వెల్ ఒకదశలో రిటైర్ అవ్వాలని అనుకున్నాడు. కెప్టెన్ పాట్ కమిన్స్ సైతం అందుకు అడ్డు చెప్పలేదు. కానీ ఆసీస్ గెలవాలంటే మ్యాక్స్‌వెల్ కచ్చితంగా క్రీజులో ఉండాలని భావించిన నిక్.. అతనికి తోడ్పాటునందించాడు. పరుగెత్తడం తగ్గించి.. షాట్లు మాత్రమే ఆడాలన్న నిక్ సలహా బాగా పనిచేసింది. ‘‘విజయానికి మరో 55 పరుగులు కావాల్సిన సమయంలో మ్యాక్స్‌వెల్ మైదానంలో శవం లాగా పడిపోయాడు. కుడి పిక్క, ఎడమ తొడతో పాటు మరికొన్ని శరీర భాగాలు ఒకేసారి తీవ్రంగా పట్టేశాయి. నొప్పిని తగ్గించే ప్రయత్నం చేస్తుండగా.. ‘నా పనైపోయింది. నేనిక ఆడలేను. మైదానం నుంచి బయటకు వస్తా. రిటైరవుతా’ అని మ్యాక్స్‌వెల్ అన్నాడు. కొన్ని సందర్భాల్లో మైదానం వీడటం సరైనదే. కానీ మ్యాక్స్‌వెల్ మైదానాన్ని వీడితే అతని పరిస్థితి మరింత దిగజారేది. ఆ సమయంలో పూర్తిగా విశ్రాంతినిస్తే దేహంలోని అన్ని భాగాలు ఒక్కసారిగా పట్టేస్తాయి. లేచి నిల్చోడమే సరైనదని మ్యాక్స్‌వెల్‌కు సలహా ఇచ్చా. పరుగును తగ్గించుకుని.. షాట్లు మాత్రమే ఆడాలని సూచించా’’ అని నిక్ వివరించాడు.