Kejriwal – అవినీతిపై మోదీ పోరు ఓ నాటకం

అవినీతిపై పోరాడుతున్నట్లు కేంద్రంలోని నరేంద్రమోదీ సర్కారు చెప్పడం ఓ నాటకమని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ విమర్శించారు. తప్పుడు పనులు చేస్తున్నవారిగా భాజపా ఆరోపించేవారంతా ఆ పార్టీలో చేరిన తర్వాత మంత్రివర్గాల్లో స్థానం పొందుతుంటారని ఎద్దేవా చేశారు. హరియాణాలోని రోహ్తక్లో ఆదివారం ఆప్ నిర్వహించిన సభలో ఆయన ప్రసంగించారు. ‘ఓ భారీ నేరమో, పెద్ద పాపమో చేసినవారు భాజపాలో చేరిపోతే వారి జోలికి వెళ్లేందుకు సీబీఐ, ఈడీ, ఐటీ వంటి విభాగాల అధికారులు సాహసించరు. ఈడీకి చిక్కి, జైలుకు వెళ్లినవారు లంచగొండులు కారు. ఈడీ భయంతో భాజపాలో చేరినవారే అవినీతిపరులు. ఈడీకి దొరికి, భాజపాలో చేరనివారు అసలైన నిజాయితీపరులు. ఎందుకంటే- ఈరోజు కాకపోతే రేపైనా బయటకు వస్తామని వారికి తెలుసు. మోదీ ఒక రాష్ట్రానికి వెళ్లి కొంతమంది నాయకుల్ని అవినీతిపరులుగా చెప్పి, వాళ్లంతా జైలుకు వెళ్తారని ప్రకటించారు. కొన్నాళ్లకు వారంతా భాజపాలో చేరారు. ఇదేనా అవినీతిపై పోరాటం?’ అని కేజ్రీవాల్ నిలదీశారు. ప్రధాని ఆయన మిత్రుని కోసం మాత్రమే పనిచేస్తారని, దేశాన్ని నడిపేది ఆ మిత్రుడేనని దిల్లీ సీఎం ఆరోపించారు. చట్టాలనూ ఆ వ్యక్తి కార్యాలయం నుంచే చేసి ఆమోదిస్తుంటారని, ఇది ప్రమాదకరమని అన్నారు. ఒకవ్యక్తి కోసం కాకుండా దేశంలోని 140 కోట్ల మంది కోసం పనిచేస్తే మోదీకే ఆప్ మద్దతు ఇస్తుందని ప్రకటించారు.