Chhattisgarh – అంజోరా గ్రామంలో ఇద్దరు ఎమ్మెల్యేలు!

ఎన్నికల తేదీ సమీపిస్తుండటంతో ఛత్తీస్‌గఢ్‌లోని అంజోరా గ్రామంలో నాయకుల ప్రచారం హోరెత్తుతోంది. అయిదు వేల జనాభా ఉన్న ఈ గ్రామం రెండు శాసనసభా నియోజకవర్గాల పరిధిలో ఉండటం ప్రత్యేకత. అటు దుర్గ్, ఇటు రాజనందగావ్ జిల్లాల పరిధిలో రెండు భాగాలుగా ఈ గ్రామం ఉంది. గ్రామ వీధుల్లో ఒక వరుస రాజనందగావ్ సెగ్మెంటు పరిధిలోకి వస్తే, మరో వరుస దుర్గ్ గ్రామీణ నియోజకవర్గ పరిధిలోకి వస్తుంది. గ్రామంలోని కొన్ని కుటుంబాల ఓట్లు రెండు నియోజకవర్గాల మధ్య చీలి ఉండటం విశేషం. ముంబయి – హావ్‌డా జాతీయ రహదారి – 53పై దుర్గ్ నగరానికి 10 కి.మీ.ల దూరంలో అంజోరా ఉంటుంది. రెండు జిల్లాల పరిధిలోకి వచ్చే రెండు పంచాయతీల కలబోత ఈ గ్రామం. ‘‘ఒక్కోసారి అభ్యర్థులు గ్రామంలోకి వచ్చినపుడు ఏ నియోజకవర్గ ఓటర్లు ఎవరన్నది గందరగోళం ఏర్పడుతూ ఉంటుంది. మా గ్రామం ఇలా రెండుగా వేరుపడినా పండుగలు, వేడుకలన్నీ కలిసికట్టుగా జరుపుకొంటాం’’ అని అంజోరా పంచాయతీ (రాజనందగావ్) సర్పంచి అంజు సాహు తెలిపారు. రెండు దశల్లో పోలింగు జరగనున్న ఛత్తీస్‌గఢ్‌లో రాజనందగావ్ నియోజకవర్గ ఎన్నిక ఈ నెల 7న నిర్వహించనుండగా, దుర్గ్ గ్రామీణ నియోజకవర్గ ఓటర్లు నవంబరు 17న తమ ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. రాజనందగావ్ నుంచి భాజపా తరఫున మాజీ సీఎం రమణ్‌సింగ్ పోటీలో ఉండగా.. రాష్ట్ర ఖనిజాభివృద్ధి కార్పొరేషను ఛైర్మన్ గిరీశ్ దేవాంగన్ కాంగ్రెస్ వైపు నుంచి ఢీకొంటున్నారు. దుర్గ్ గ్రామీణ నియోజకవర్గంలో కాంగ్రెస్ నుంచి ప్రముఖ ఓబీసీ నేత, రాష్ట్ర మంత్రి సాహు పోటీ చేస్తుండగా.. భాజపా కొత్త అభ్యర్థిని బరిలో నిలిపింది.