#Entertainment #Uncategorized

Bhagavanth Kesari – ఫీల్‌గుడ్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌

నందమూరి బాలకృష్ణ (Balakrishna) కథానాయకుడిగా నటించిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ‘భగవంత్‌ కేసరి’ (Bhagavanth Kesari). అనిల్‌ రావిపూడి దర్శకుడు. ఈ సినిమాలో శ్రీలీల కీలక పాత్ర పోషించారు. తాజాగా ట్రైలర్‌ విడుదల కార్యక్రమంలో శ్రీలీలను ఉద్దేశించి బాలయ్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆమె తనని చిచ్చా చిచ్చా అంటూ టార్చర్‌ పెట్టిందని సరదాగా అన్నారు. ‘‘నా తదుపరి సినిమాలో శ్రీలీలను హీరోయిన్‌గా తీసుకోవాలనుకున్నా. అదే విషయాన్ని మా ఇంట్లో చెప్పా. ఆ మాట విని మా అబ్బాయి మోక్షజ్ఞ కోప్పడ్డాడు. ‘నేను హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నాను. కుర్ర హీరోని. నువ్వు ఏమో ఆమెకు ఆఫర్‌ ఇస్తావా?’ అని అన్నాడు. మోక్ష మాటలకు సమాధానం చెప్పలేకపోయా’’ అని ఆయన సరదాగా చెప్పారు. శ్రీలీల గొప్ప నటి అని.. మంచి భవిష్యత్తు ఉందన్నారు.

ఇదే కార్యక్రమంలో శ్రీలీల మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. ఇందులో తాను పోషించిన విజ్జి పాప పాత్ర తన మనసుకు చేరువైందన్నారు. ‘‘విజ్జి పాప పాత్ర కోసం నన్ను సెలెక్ట్‌ చేసినందుకు చిత్ర దర్శకుడు అనిల్‌ రావిపూడికి థ్యాంక్యూ చెప్పాలి. ఎన్ని పాత్రల్లో నటించినా కేవలం కొన్ని మాత్రమే మన మనసుకు దగ్గరవుతాయి. అలా, నాకెంతో చేరువైన పాత్ర ఇది. కథ విన్నప్పుడు ఎంతో ఎమోషనల్‌గా అనిపించింది. నా జీవితంలో చూడని కొన్ని అనుభూతులను ఈ సినిమా నాకు అందించింది. కొన్ని సన్నివేశాలు చిత్రీకరిస్తున్నప్పుడు షాట్‌ అయ్యాక కూడా నేనింకా అదే పాత్రలో ఉండిపోయేదాన్ని. ఇది గొప్ప కథ. అందమైన సందేశం ఉంది. ఇలాంటి కథలో భాగం కావడం నా అదృష్టం’’ అని ఆమె అన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *