#Trending

This is the story of plants.. – ఇదండీ మొక్కల కథ..

రాష్ట్ర ప్రభుత్వం(State Government) ఆకుపచ్చ తెలంగాణ(Telangana) లక్ష్యంగా హరితహారం(Harithaharam) పథకాన్ని ప్రవేశపెట్టింది. 2018లో వచ్చిన నూతన పంచాయతీరాజ్‌ చట్టం ప్రకారం స్థానిక సంస్థలకు కేటాయించే బడ్జెట్‌ల్లో 10 శాతం నిధులు పచ్చదనానికి వెచ్చించాల్సి ఉంది. ప్రతి గ్రామం, పురపాలక సంఘం పరిధిలో తప్పనిసరిగా నర్సరీ ఉండాలనేది నిబంధన. అంతటి ప్రాధాన్యం కలిగిన మొక్కల పెంపకానికి నేతలు, అధికారులు అనుకున్నంత ప్రాధాన్యం ఇవ్వడం లేదు. ఉమ్మడి జిల్లాలోని ఈ ఏడాది వానాకాలంలో ఆదిలాబాద్‌కు 45.09 లక్షలు, కుమురంభీంకు 53.03 లక్షలు, మంచిర్యాలకు 45.17 లక్షలు, నిర్మల్‌ జిల్లాకు 50.86 లక్షల మొక్కలు నాటాలనేది ప్రభుత్వం నిర్ణయించిన లక్ష్యం. ఇప్పటికే దాదాపుగా పూర్తిస్థాయిలో లక్ష్యం చేరుకున్నట్లు జిల్లా యంత్రాంగం నివేదికలు సిద్ధం చేయడం విస్మయానికి గురిచేస్తోంది. వివిధ ప్రభుత్వ శాఖలకు ప్రభుత్వం ఇచ్చిన లక్ష్యాలను కాగితాల్లోనే సర్దుబాటు చేయడం తప్పితే ఎక్కడ మొక్కలు నాటుతున్నారో? ఎన్ని సంరక్షిస్తున్నారో? అంతుచిక్కడం లేదు.

నెరవేరని లక్ష్యం

ప్రభుత్వం ఆగస్టు 26న కోటి వృక్షార్చన నిర్వహించింది. అన్ని ప్రభుత్వ శాఖలు మొక్కలు నాటాలని పిలుపునిచ్చింది. కానీ ఆదిలాబాద్‌ జిల్లాలో ఆశించిన ప్రయోజనం కనిపించలేదు. పశు సంవర్ధక శాఖకు 3 వేల మొక్కలు నాటాలనేది లక్ష్యం కాగా వారం రోజుల కిందట ఒక్కటంటే ఒక్కటి నాటలేదు. కానీ తాజాగా మూడు వేలు నాటినట్లు లెక్క తేల్చింది. ఎస్సీ కార్పొరేషన్‌కు 50 వేల మొక్కలు నాటాలనే లక్ష్యానికి వారం కిందటి వరకు నాటనే లేదు. తాజాగా 27,806 మొక్కలు నాటినట్లు చూపించారు. జిల్లా రెవెన్యూ 3 వేలు, వైద్యారోగ్య శాఖ 8 వేలు నాటే లక్ష్యాన్ని పట్టించుకోవడం లేదు. దాదాపు అన్ని ప్రభుత్వ శాఖల పనితీరు అలాగే ఉంది. కుమురం భీం, మంచిర్యాల జిల్లాల అటవీ ప్రాంతంలో ఉన్న మొక్కలనే చూపిస్తున్నట్లు తెలుస్తోంది. మరీ లోతుగా ఆరాతీస్తే కవ్వాల్‌ అభయారణ్యంలోని గడ్డి క్షేత్రాల్లో ఉన్న ఆకుపచ్చదనమంతా హరితహారం అన్నట్లుగానే చూపించే ప్రయత్నం జరుగుతోంది. రాష్ట్ర అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ప్రాతినిథ్యం వహించే నిర్మల్‌ జిలాలో నీటి వసతికి లోటు లేకున్నా ప్రణాళికాబద్ధంగా మొక్కలు నాటాలనే సంకల్పం కనిపించడం లేదు.
‘‘ సరైన నిధులు అందుబాటులో ఉండటం లేదు. పర్యవేక్షించడానికి సిబ్బంది కొరత ఉంది. ఇక మొక్కలు నాటాలంటే ఎలా? ఇక నివేదికల్లో సర్దుబాటు చేయకుంటే ఏం చేస్తాం’’ అని పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఓ జిల్లాస్థాయి కీలక అధికారి మాటలను బట్టిచూస్తే హరితహార కార్యాచరణ ఎలా ఉందో వెల్లడవుతోంది. ప్రభుత్వ శాఖల వారీగా సమీక్షలు లేకపోవడం, కార్యక్రమం మాట వరుసకే అన్నట్లుగా మారుతోంది. ఫలితంగా అధికారులు సమర్పించే నివేదికలతోనే సరిపెట్టుకోవాల్సి వస్తోంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *