Solar Eclipse Aditya-L1 : ‘ఆదిత్య-ఎల్1’కి చిక్కని సంపూర్ణ సూర్యగ్రహణం.. కారణం ఇదే!

ఏప్రిల్ 8వ తేదీన ఓ అద్భుతమైన ఖగోళ ఘటన సంభవించనుంది. ఉత్తర అమెరికా, కెనడా మీదుగా సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడనుంది. భూమి, సూర్యుడు మధ్య చంద్రుడు నేరుగా వెళ్తాడు కాబట్టి.. కొన్ని నిమిషాలపాటు కాంతి పూర్తిగా నిలిచిపోనుంది.
ఏప్రిల్ 8వ తేదీన ఓ అద్భుతమైన ఖగోళ ఘటన సంభవించనుంది. ఉత్తర అమెరికా, కెనడా మీదుగా సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడనుంది. భూమి, సూర్యుడు మధ్య చంద్రుడు నేరుగా వెళ్తాడు కాబట్టి.. కొన్ని నిమిషాలపాటు కాంతి పూర్తిగా నిలిచిపోనుంది. భారత కాలమానం ప్రకారం ఇది రాత్రి సమయంలో సంభవిస్తుంది కాబట్టి.. ఈ గ్రహణం మనకు కనిపించదు. కేవలం మనకే కాదండోయ్.. సూర్యునిపై అధ్యయనం చేసేందుకు లాగ్రాంజ్ పాయింట్-1 (ఎల్1) (Lagrange Point-1) చుట్టూ ఉన్న కక్ష్యలో ప్రవేశపెట్టిన ‘ఆదిత్య ఎల్1’కి కూడా ఇది కనిపించదు.

తనలో అమర్చిన ఆరు సాధనాలను ఉపయోగించి నితంతరం సూర్యుడిని పర్యవేక్షించే ఆదిత్య L1.. అరుదైన సంపూర్ణ సూర్యగ్రహణాన్ని మాత్రం చూడలేకపోతుందని ఇస్రో తెలిపింది. ఇందుకు కారణం.. ఆదిత్య L1లో ఏదైనా పొరపాటో లేదా లోపం వల్లో కాదు.. దానిని ఉంచిన స్థానం! ఈ గ్రహణం సమయంలో సూర్యుడిని పూర్తిగా కమ్మేసి చంద్రుడు.. ఆదిత్య ఎల్1కు వెనుకవైపు ఉంటాడు. అంటే.. సూర్యుడికి, చంద్రుడికి మధ్యలో ఆ శాటిలైట్ ఉంటుంది. అందుకే.. గ్రహణ ఘట్టాన్ని ఆదిత్య ఎల్1 వీక్షించలేదని ఇస్రో ఛైర్మన్ ఎస్. సోమనాథ్ వెల్లడించారు. అయితే.. గ్రహణ సమయంలో సూర్య కిరణాల ప్రభావం ఎలా ఉంటుందనే విషయాలను ఈ మిషన్ పరిశీలించనుందని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. క్రోమోస్పియర్, నక్షత్రాల కరోనాని అధ్యయనం చేసేందుకు ఈ సమాచారం ఉపయోగపడుతుందని చెప్తున్నారు
కాగా.. ఈ సంపూర్ణ సూర్యగ్రహణం ఉత్తర అమెరికాలోని కొన్ని దేశాల్లో మాత్రమే కనిపిస్తుంది. భారత్‌లో కనిపించదు. మన కాలమానం ప్రకారం.. ఈరోజు రాత్రి 9 గంటల తర్వాత నుంచి రేపు తెల్లవారుజామున 2.22 గంటల వరకు గ్రహణ కాలం ఉంది. ఉత్తర అమెరికాలో పగటి సమయం కాబట్టి.. అక్కడ ఈ గ్రహణం కనిపిస్తుంది. అయితే.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు యూట్యూబ్, ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో లైవ్ స్ట్రీమింగ్ ద్వారా దీనిని వీక్షించవచ్చు. ప్రముఖ అంతరిక్ష సంస్థ నాసా సైతం తన సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో రాత్రి 10:30 గంటలకు ఈ గ్రహణాన్ని లైవ్ స్ట్రీమ్ చేయనుంది.