Russia : Terror Attack on Krakow city concert hall in the capital Moscow Russia : మెసేజింగ్ యాప్ నుంచే మాస్కోదాడి కుట్ర అమలు.. నిందితుల ఇంటరాగేషన్‌లో వెల్లడి..!

ఇంటరాగేషన్‌లో వెల్లడి..!
రష్యా రాజధాని మాస్కోలో జరిగిన దాడికి కేవలం ఓ మెసేజింగ్ యాప్ ద్వారానే కుట్రదారులు రూపం ఇచ్చినట్లు తెలుస్తోంది. నిందితుల ఇంటరాగేషన్ వీడియోలను రష్యా అధికారిక టీవీ విడుదల చేసింది.
ఇంటర్నెట్‌డెస్క్: రష్యా రాజధాని మాస్కోలోని క్రాకస్ సిటీ కాన్సర్ట్ హాలులో దాడి (Moscow attack) చేసిన ముష్కరులను కేవలం మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్ నుంచే నడిపించినట్లు గుర్తించారు. నిందితులను బంధించినట్లు ఇప్పటికే రష్యా ప్రకటించింది. తమకు డబ్బులు, ఆయుధాలు ఇచ్చిన వారెవరో తెలియదని వారు చెబుతున్నారు. దీనికి సంబంధించిన దృశ్యాలను జాతీయ టీవీ చానెళ్లు ప్రసారం చేశాయి. నలుగురు నిందితులు, వారు వాడిన కారును చూపాయి. వీరిని బ్రియాన్స్క్ పశ్చిమ ప్రాంతంలో ఖట్సన్ అనే గ్రామం వద్ద రష్యా ప్రత్యేక దళాలు అరెస్ట చేశాయి. రాత్రి వేళ చిత్రీకరించిన ఈ దృశ్యాల్లో దళాలు ఒక వ్యక్తిని ప్రశ్నిస్తుండగా.. రష్యా యాసలో అతడు మాట్లాడుతున్నట్లు ఉన్నాయి. వీరంతా తజికిస్థాన్‌కు చెందిన వారని రష్యా ఎంపీ ఒకరు పేర్కొన్నారు.
కింద కూర్చొని ఉన్న ఓ నిందితుడు మాట్లాడుతూ ‘‘డబ్బుల కోసమే ప్రజలపై కాల్పులు జరిపాను’’ అని చెబుతున్నట్లు స్పష్టంగా ఉంది. కొందరు 5 లక్షల రూబుళ్లను ఆఫర్ చేసినట్లు పేర్కొన్నాడు. అంతేకాదు.. వీటిల్లో సగం మొత్తం ఇప్పటికే స్వీకరించి ఓ బ్యాంక్ ఖాతాలో వేసినట్లు గుర్తించారు. తమను సంప్రదించి డీల్ కుదుర్చుకొని డబ్బు, ఆయుధాలు సరఫరా చేసినవారు ఎవరో తెలియదని పేర్లు చెప్పలేదని.. కేవలం టెలిగ్రామ్ యాప్ నుంచే సంప్రదించినట్లు వెల్లడించాడు. దాడి అనంతరం ఆయుధాలను రోడ్డుపక్కన పారేసినట్లు మరో దుండగుడు తెలిపాడు. ఇక నిందితులపై దళాలు దాడి చేస్తున్న వీడియోలు కూడా బయటకు వచ్చాయి. తమ దళాలు ఎఫ్‌ఎస్‌బీతో కలిసి నిందితులను అరెస్టు చేసినట్లు చెచెన్ నాయకుడు రంజాన్ కదిరోవ్ పేర్కొన్నాడు.
మాస్కోపై జరిగిన దాడిలో ఇప్పటి వరకు దాదాపు 133 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. మొత్తం 11 మంది అనుమానితులను అదుపులోకి తీసుకొన్నారు. ఈ దాడికి ఇస్లామిక్ స్టేట్ ఇప్పటికే బాధ్యత స్వీకరించింది. తాము మిషిన్‌గన్‌లు, బాంబులు, కత్తులతో ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పేర్కొంది.