#Andhra Politics #Trending

ప్రశాంత్‌ కిశోర్‌ మాటల్లో విశ్వసనీయత లేదు: విజయసాయిరెడ్డి

నెల్లూరు: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థిగా బరిలో దిగుతున్నట్లు రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి తెలిపారు. నెల్లూరు పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇప్పటికే అభ్యర్థులు ఖరారు అయ్యారని చెప్పారు. పుట్టి పెరిగిన గడ్డపై పోటీ చేయడం సంతోషంగా ఉందని, గెలిచి ప్రజలకు సేవ చేస్తానని పేర్కొన్నారు. జిల్లా మీద తనకు పూర్తి అవగాహన ఉందని, రాజ్యసభ సభ్యుడిగా ఉంటూ జిల్లాను అభివృద్ధి చేసినట్లు తెలిపారు.

ప్రశాంత్‌ కిశోర్‌ మాటల్లో విశ్వసనీయత లేదన్నారు విజయసాయిరెడ్డి. ఆ మాటల వెనక దురుద్ధేశం ఉందన్నారు. ఎవరి హయాంలో అభివృద్ధి జరిగిందో ప్రజలకు బాగా తెలుసని అన్నారు. అభివృద్ధిపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు అర్థరహితమని అన్నారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీని మరోసారి గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు.

ఈనెల 10న సిద్ధం సభలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మేనిఫెస్టో ప్రకటిస్తారని పేర్కొన్నారు. మూడు సిద్ధం మహాసభలు చరిత్రలో నిలిచిపోయేలా శ్రేణులు హాజరయ్యారని తెలిపారు. ప్రజలకు ఇచ్చిన 99 శాతం హామీలను సీఎం జగన్‌ అమలు చేశారని పేర్కొన్నారు. మరింత మెరుగైన పరిపాలన అందించేందుకు సీఎం జగన్ సిద్ధంగా ఉన్నారని అన్నారు. 

పార్టీకి, ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటానన్నారు. టికెట్ రాలేదని మంత్రి జయరాం టీడీపీలో చేరారని, రాజీనామా చేసి టీడీపీ కండువా కప్పుకుంటే బాగుండేదని అన్నారు. వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి తనకు మంచి మిత్రులని.. రాజకీయం వేరు, స్నేహం వేరని చెప్పారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *