ISRO: చంద్రుడిపై ఆక్సిజన్ ఆనవాళ్లు ఉన్నట్లు గుర్తించిన ప్రజ్ఞాన్ రోవర్

బెంగళూరు: చంద్రుడిపై ఇస్రో సంచలన ప్రకటన చేసింది. చంద్రునిపై ల్యాండ్ అయిన చంద్రయాన్ 3 రోవర్ కీలక విషయాలను రాబడుతూ సమాచారం మొత్తం ఇస్రోకు పంపుతోంది. కీలక సమాచారం పంపిన ప్రజ్ఞాన్ రోవర్ .. చంద్రుడిపై ఆక్సిజన్ ఆనవాళ్లు ఉన్నట్లు గుర్తించింది. అలాగే చంద్రుడిపై పలు ఖనిజాలు, మాంగనీస్, అల్యూమినియం, సల్ఫర్, సిలికాన్ ఆనవాళ్లు ఉన్నట్లు గుర్తించగా, హైడ్రోజన్ ఆనవాళ్ల కోసం గుర్తించే పనిలో రోవర్ ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
చంద్రయాన్-3 (Chandrayaan-3) మిషన్లో భాగంగా జాబిల్లిపై విజయవంతంగా పయనిస్తోన్న ప్రజ్ఞాన్ రోవర్ (Pragnan Rover).. అక్కడి ఉపరితలంపై పరిశోధనలో మరిన్ని కీలక అంశాలను గుర్తించింది. ఇందులోని ‘లేజర్ ఇండ్యూస్డ్ బ్రేక్డౌన్ స్పెక్ట్రోస్కోప్ (LIBS)’ పరికరం.. చంద్రుడి దక్షిణ ధ్రువం వద్ద ఉపరితలంపై సల్ఫర్ (S) ఉనికిని స్పష్టంగా గుర్తించినట్లు ఇస్రో (ISRO) శాస్త్రవేత్తలు వెల్లడించారు. దీంతోపాటు అల్యూమినియం (Al), కాల్షియం (Ca), ఫెర్రమ్ (ఇనుము, Fe), క్రోమియం (Cr), టైటానియం (Ti), సిలికాన్ (Si), మాంగనీస్ (Mn), ఆక్సిజన్ (O) మూలకాలను సైతం గుర్తించడం విశేషం. హైడ్రోజన్ కోసం శోధన కొనసాగిస్తోందని ఇస్రో తెలిపింది.
చందమామపై మట్టి, రాళ్లను అధ్యయనం చేసేందుకు.. అక్కడి రసాయన, ఖనిజాలను పరిశోధించేందుకుగానూ ‘లిబ్స్’ పరికరాన్ని పంపించారు. ఈ పరికరాన్ని బెంగళూరులోని ఎలక్ట్రో-ఆప్టిక్స్ సిస్టమ్స్ ప్రయోగశాల (LEOS)లో అభివృద్ధి చేసినట్లు ఇస్రో వెల్లడించింది.