Fans of top actors who have fight… కొట్టుకున్న అగ్ర నటుల అభిమానులు, ఇదెక్కడి గోలరా బాబూ

బెంగుళూరులో ప్రభాస్ అభిమానులు, అల్లు అర్జున్ అభిమానుల మధ్య ప్రత్యక్షంగా కొట్టుకోవటంతో అసలు ఈ అభిమానుల గొడవ ముందు ముందు ఏటో పోతుందో అని పరిశ్రమలో చర్చ నడుస్తోంది. ఇంతవరకు సామాజిక మాధ్యమాల్లో మాటలవరకే పరిమితమైన అభిమానులు ఇప్పుడు ప్రత్యక్షంగా ఒకరినొకరు కొట్టుకోవటం వరకు దారి తీసింది. అగ్ర నటులు ఇక స్పందించాల్సిన సమయం ఆసన్నమైంది అని పరిశ్రమలో అంటున్నారు.
అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుండి నేటి వరకు ఒక నటుడి అభిమానులు ఇంకో నటుడిపై ఎదో అనటం, ఆ అభిమానులు కూడా దానికి సమాధానం ఇవ్వటం, ఇలా ఇంతవరకు మాటలతో యుద్ధం జరిగింది, ఆ తరువాత సామాజిక మాధ్యమాల్లో ఒకరినొకరు దూషించుకోవటం ఎక్కువైంది. నిన్న బెంగుళూరు లో అయితే ఏకంగా అభిమానుల మధ్య ప్రత్యక్షంగా కొట్లాట జరగటం, ప్రభాస్ అభిమానిని ఒకరిని, అల్లు అర్జున్ అభిమానులు చితక బాదటంతో ఆ వీడియో ఇప్పుడు సామజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
సినిమా పరిశ్రమలో నటులందరూ తమ మధ్యలో ఎటువంటి భేదాభిప్రాయాలు లేవని, కేవలం తమ చిత్రాల మధ్యనే పోటీ ఉంటుందని చాలాసార్లు చెప్పారు. కొంతమంది అగ్ర నటులు అయిన మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ అయితే బహిరంగంగానే తమమధ్య ఎటువంటి అభిప్రాయభేదాలు లేవని, అభిమానుల మధ్య కూడా అలాంటివి ఉండకూడదని, కలిసి వుండాలని ఇద్దరూ కలిపి ఒకే వేదికపై చెప్పారు.
అయినా అభిమానుల మనస్సులో మాత్రం మార్పు రాలేదనటానికి నిన్న బెంగుళూరులో జరిగిన కొట్లాట ఒక ఉదాహరహణ. తెలుగులో నటులకి వున్నన్ని అభిమాన సంఘాలు మరెక్కడా ఉండవేమో అనికూడా అనిపిస్తూ ఉంటుంది. అగ్ర నటుడి సినిమా విడుదలైనప్పుడు అయితే సామాజిక మాధ్యమాల్లో వేరే నటుల అభిమానులు ఆ సినిమాకి నెగటివ్ ప్రచారం చెయ్యడం, లేదా సినిమా బాగోలేదు అనే వార్త వైరల్ చెయ్యడం లాంటివి ఇప్పుడు పరిపాటి అయిపోయాయి. అయితే ఇంతవరకు సామాజిక మాధ్యమాల్లో మాత్రమే ఎంతో దూకుడుగా వున్న అభిమానులు ఈసారి కొట్టుకోవటం వరకు దారితీశారు అంటే, ముందు ముందు ఈ అభిమానుల గొడవలు ఎటు దారితీస్తాయో అని పరిశ్రమలో ఒక చర్చ నడుస్తోంది.
ఇటువంటి సమయంలోనే ఆయా నటులు తమ సామాజిక మాధ్యమాల్లో అభిమానులను శాంతపరిచి, తమ మధ్య ఎటువంటి భేదాభిప్రాయాలు లేవని చెపితే అభిమానుల మధ్య ఇలాంటివి తగాదాలు రాకుండా వుంటాయని కూడా అంటున్నారు. మరి నిన్న జరిగిన ఈ సంఘటనపై ప్రభాస్, అల్లు అర్జున్ లు ఏమైనా స్పందిస్తారేమో చూడాలి. ప్రభాస్ సినిమా ‘కల్కి 2898ఎడి’ విడుదలకి సిద్ధం అవుతుండగా, అల్లు అర్జున్ ‘పుష్ప 2’ షూటింగ్ కోసమని నిన్న విశాఖపట్నం వెళ్లారు. ఈ నటుల అభిమానులు కొట్టుకున్న వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది