#Trending

Elon Musk: ఆ దాడికి స్టార్‌లింక్‌ సేవలు ఇవ్వం.. మస్క్‌ నిర్ణయం..!

యుద్ధంతో దద్దరిల్లుతున్న ఉక్రెయిన్‌(Ukraine)కు స్పేస్‌ఎక్స్‌ యజమాని ఎలాన్‌ మస్క్‌ (Elon Musk) షాకిచ్చారు. తమకు అత్యవసరంగా  స్టార్‌ లింక్‌ సేవలను అందించాలని ఉక్రెయిన్‌ చేసిన విజ్ఞప్తిని శుక్రవారం ఆయన తిరస్కరించారు. ఈ విజ్ఞప్తిని ఆమోదిస్తే యుద్ధానికి పెద్ద కవ్వింపు చర్యగా మారుతుందని.. అప్పుడు సంక్షోభం మరింత తీవ్రమవుతుందని వివరించారు. 

ఒక ఎక్స్‌ (ట్విటర్‌) వినియోగదారుడు చేసిన వ్యాఖ్యలకు సమాధానంగా ఈ విషయాన్ని వెల్లడించారు. ‘‘ఉక్రెయిన్‌ కీలక ఎదురుదాడి చేస్తున్న సమయంలో స్టార్‌ లింక్‌ శాటిలైట్‌ కమ్యూనికేషన్స్‌ నెట్‌వర్క్‌ సేవలను నిలిపివేయాలని తన ఇంజినీర్లకు మస్క్‌ రహస్యంగా సూచించారు. రష్యా నౌకాదళంపై ఉక్రెయిన్‌ అకస్మాత్తుగా చేసిన దాడిని అడ్డుకోవడానికే ఇలా చేశారు. దీంతో మళ్లీ స్టార్‌ లింక్‌ సేవలను పునరుద్ధరించాలని మస్క్‌ను ఉక్రెయిన్‌ కోరింది. కానీ, ఉక్రెయిన్‌ చేస్తున్న ఆ దాడికి ప్రతిగా రష్యా అణ్వాయుధాలతో స్పందించే అవకాశం ఉందని మస్క్‌ ఆందోళన వ్యక్తం చేశారు’’ అని సదరు వినియోగదారుడు వ్యాఖ్యనించాడు. 

ఈ వ్యాఖ్యలపై మస్క్‌ ఎక్స్‌లో స్పందిస్తూ..‘‘ఆ ప్రాంతాల్లో స్టార్‌ లింక్‌ యాక్టివేట్‌ చేయలేదు.. అంతే కానీ వేటిని స్పేస్‌ ఎక్స్‌ డీయాక్టివేట్‌ చేయలేదు’’ అని వివరించారు. అత్యవసరంగా సెవస్తపోల్‌ వద్ద స్టార్‌ లింక్‌ను యాక్టివేట్‌ చేయాలని ఉక్రెయిన్‌ నుంచి అభ్యర్థన వచ్చిందని అంగీకరించారు. వారు అక్కడ ఉన్న రష్యా నౌకలను ముంచాలనే ఉద్దేశంతోనే అడిగారని వెల్లడించారు. ఒక వేళ తాను అంగీకరిస్తే.. స్టార్‌ లింక్‌ ఓ పెద్ద యుద్ధ కవ్వింపు చర్యకు స్పష్టంగా సహకరించినట్లవుతుందన్నారు.   

Leave a comment

Your email address will not be published. Required fields are marked *