#Trending

Diart’s blind snake in Papikonda : పాపికొండల్లో అరుదైన డయార్ట్స్‌ బ్లైండ్‌ స్నేక్‌ (గుడ్డి పాము)

రంపచోడవరం జలపాతం వద్ద ‘డయార్ట్స్‌ స్నేక్‌’ 

ఇది సంచరిస్తే పర్యావరణం పరిఢవిల్లుతున్నట్టు లెక్క 

1839లో జావా దీవుల్లో తొలిసారిగా గుర్తింపు 

2022 సెప్టెంబర్ లో రంపచోడవరం జలపాతం వద్ద లభ్యం 

డీఎన్‌ఏ పరీక్షల ద్వారా ఇది డయార్ట్స్‌ స్నేక్‌ అని తేల్చిన శాస్త్రవేత్తలు 

కైకలూరు: పర్యావరణ మిత్రునిగా పిలిచే అరుదైన డయార్ట్స్‌ బ్లైండ్‌ స్నేక్‌ (గుడ్డి పాము) జాడ నిజమేనని మంచినీటి జీవశాస్త్ర ప్రాంతీయ కేంద్రమైన హైదరాబాద్‌లోని జూలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా శాస్త్రవేత్తలు నిర్ధారించారు. గుంటూరులోని బయోడైవర్సిటీ బోర్డు పాపికొండలు సమీపంలోని రంపచోడవరం జలపాతం వద్ద 2022 సెపె్టంబర్‌ 8న చనిపోయిన డయార్ట్స్‌ బ్‌లైండ్‌ స్నేక్‌ మృతదేహాన్ని కనుగొన్నారు.

జూలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియాకు చెందిన శాస్త్రవేత్తలు దీపా జైస్వాల్, బి.భరత్, ఎం.కరుతాపాండి, శ్రీకాంత్‌ జాదవ్, కల్యాణి, కుంటేలు గుడ్డిపాము కళేబరాన్ని రసాయనాలతో హైదరాబాద్‌ జూలాజికల్‌ మ్యూజియంలో భద్రపరిచారు. అప్పటినుంచి పరిశోధనలు చేసి చివరకు డీఎన్‌ఏ పరీక్ష ద్వారా దీనిని అరుదైన డయార్ట్స్‌ బ్లైండ్‌ స్నేక్‌గా నిర్ధారించారు.   

1839లో జావా దీవుల్లో గుర్తింపు 
డయార్ట్స్‌ బ్లైండ్‌ స్నేక్‌ను 1839లో ఇండోనేషియాలోని జావా దీవుల్లో తొలిసారిగా గుర్తించారు. ఫ్రెంచ్‌ ప్రకృతి శాస్త్రవేత్త పియరి మోడర్డ్‌ డియార్డ్‌ గౌరవార్థం దీనికి డయార్ట్స్‌ అని నామకరణం చేశారు. ఆర్గిరోఫిస్‌ డయార్టి శాస్త్రీయ నామం కలిగిన ఇది టైఫ్లోపిడే కుటుంబంలో విషపూరితం కాని పాము జాతికి చెందినది. ఇవి అడుగు వరకు పొడవు పెరుగుతాయి.

భారతదేశంలో ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్, సిక్కిం, అరుణాచల్‌ప్రదేశ్, అసోం, హరియాణా, బిహార్, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, త్రిపుర ప్రాంతాల్లో వీటి జాతి ఉంది. మొదటిసారి ఏపీలోని పాపికొండలు అభయారణ్య ప్రాంతమైన రంపచోడవరం జలపాతం వద్ద దీనిని కనుగొన్నారు. వానపాములు భూసారాన్ని పెంపొందించడంలో ఏ విధంగా సాయపడతాయో అంతకంటే ఎక్కువగా పర్యావరణాన్ని కాపాడటంలో గుడ్డిపాములు దోహదపడతాయి.  

ఐయూసీఎన్‌ ఆందోళన 
ఇంటర్నేషనల్‌ యూనియన్‌ ఆఫ్‌ కన్జర్వేషన్‌ ఆఫ్‌ నేచర్‌ (ఐయూసీఎన్‌) తగ్గుతున్న జీవుల జాబితా అయిన రెడ్‌ లిస్ట్‌లో డయార్ట్స్‌ బ్లైండ్‌ స్నేక్‌ను చేర్చింది. భారతీయ వన్యప్రాణి (రక్షణ) సవరణ చట్టంలో దీనిని చేర్చారు. చిత్త­డిగా ఉండే అటవీ ప్రాంతం, పొదలు, గడ్డి భూముల్లో ఇవి నివసిస్తాయి. వీటితో పర్యావరణం పరిఢవిల్లుతుందని శాస్త్రవేత్తలు భావిస్తారు. తూర్పు కనుమల ప్రాంతమైన తమిళనాడు, ఏపీ, ఒడిశా ప్రాంతాల్లో కేవ­లం పాపికొండలు వద్ద ఈ జాతిని గుర్తించడంతో ఈ ప్రాంతాల్లో మరింతగా వీటి జాడ ఉండే అవకాశం ఉంది.

విషపూరితమైనవి కావు డయార్ట్స్‌ బ్లైండ్‌ స్నేక్‌ విషపూరితమైనవి కావు. క్రిమికీటకాలను ఆహారంగా తీసుకుంటాయి. వానపాములు ఏ విధంగా సంతానోత్పత్తి చేస్తాయో అదేవిధంగా వీటి సంతతిని వృద్ధి చేసుకుంటాయి. పంట పొలాల్లో రసాయనాలు అధిక వినియోగం వల్ల వీటి సంతతి నశిస్తోంది. పర్యావరణ పరిరక్షణలో వీటి పాత్ర గణనీయంగా ఉంటుంది. వీటిని పరిరక్షించుకోవాలి.     – బి.భరత్, జూనియర్‌ రీసెర్చ్‌ ఫెలో, జూలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా, హైదరాబాద్‌  

Diart’s blind snake in Papikonda : పాపికొండల్లో అరుదైన  డయార్ట్స్‌ బ్లైండ్‌ స్నేక్‌ (గుడ్డి పాము)

Russia :  Terror Attack on Krakow city

Leave a comment

Your email address will not be published. Required fields are marked *