Delhi High Court : Sexual intercourse with fraudulent promise is a crime మోసపూరిత వాగ్దానంతో లైంగిక సంబంధం నేరమే

ఓ యువతి అన్నీ ఆలోచించుకుని తనకు తానుగా లైంగిక సంబంధం పెట్టుకుంటే అది అపోహ మీద ఆధారపడిన బంధం కాబోదని దిల్లీ హైకోర్టు అభిప్రాయపడింది.

దిల్లీ: ఓ యువతి అన్నీ ఆలోచించుకుని తనకు తానుగా లైంగిక సంబంధం పెట్టుకుంటే అది అపోహ మీద ఆధారపడిన బంధం కాబోదని దిల్లీ హైకోర్టు అభిప్రాయపడింది. పురుషుడు పెళ్లి చేసుకుంటాననే మోసపు హామీతో లోబరచుకున్నప్పుడు మాత్రమే దాన్ని నేరంగా పరిగణించాలని న్యాయమూర్తి జస్టిస్ అనూప్ కుమార్ తీర్పు ఇచ్చారు. ప్రస్తుత కేసులో యువతీ యువకుడు విచారణ జరుగుతున్న సమయంలోనే పెళ్లి చేసుకున్నారు కాబట్టి సమస్య సామరస్యంగా పరిష్కారమైందని వ్యాఖ్యానించారు. తనను పెళ్లి చేసుకుంటానంటూ లైంగిక సంబంధం పెట్టుకున్న ప్రియుడు…. తల్లిదండ్రులు వేరే మహిళతో నిశ్చితార్థం చేయించడంతో ముఖం చాటేశాడని భావిస్తూ పిటిషనర్ కేసుపెట్టారు. తరవాత వారిద్దరూ కోర్టు వెలుపల పరిష్కారం కుదుర్చుకుని పెళ్లి చేసుకున్నారు. అతడు తనను మోసం చేస్తాడనే అపోహతో మానభంగ నేరం కింద అభియోగం దాఖలు చేశాననీ, ఇప్పుడు పెళ్లి జరిగి ఉభయులం ఆనందంగా జీవిస్తున్నందున కేసు ఉపసంహరించుకుంటున్నానని పిటిషనర్ తెలిపారు. దీన్ని కోర్టు ఆమోదించి యువకుడిపై కేసు కొట్టేసింది.