AP News: పొలానికి వెళ్లిన రైతుకు కలిసొచ్చిన లక్.. ఒక్కసారిగా లక్షాధికారి..

రాయలసీమ… నేడు కరువు సీమగా మారిందిగానీ.. ఒకప్పుడు రతనాల సీమగా ఉండేది. వజ్రాల్ని రాసులు పోసి అమ్మేవారు. ఇప్పటికీ సీమ గర్భంలో ఎంతో సంపద దాగి ఉంది. తొలకరి వానలు పడ్డాయంటే చాలు వజ్రాల వేట కొనసాగుతుంది. తాజాగా పొలం చూసేందుకు వెళ్లిన రైతుకు లక్ కలిసొచ్చింది. ఒక్ దెబ్బతో లక్షాధికారి అయ్యాడు.
కర్నూలు జిల్లాలో మరొకరికి లక్ కలిసొచ్చింది. తన పొలంలో లచ్చిందేవి దొరికింది. లచ్చిందేవి అంటే బంగారం అనుకునేరు.. అంతకుమించిన డైమండ్. గుండాలతండికి చెందిన గిరిజనుడు పొలానికి వెళ్లగా వజ్రం దొరికింది. దాన్ని అనంతపురం జిల్లా గుత్తికి చెందిన ఓ వ్యాపారి రూ.లక్షకు కొనుగోలు చేసినట్లు సమాచారం. అటు మద్దికెర మండంలోపెరవలిలో ఓ మహిళా కూలీకి వజ్రం దొరికింది. దాన్ని స్థానిక వ్యాపారి తులం బంగారం, 70వేలు నగదు ఇచ్చి కొనుగోలు చేసినట్లు టాక్ నడుస్తోంది. ఈ వజ్రం రెండు క్యారెట్లకు పైగా బరువు ఉండగా.. పగుళ్లు ఏర్పడటంతో విలువ తగ్గించినట్లు సమాచారం. అందుకే తక్కువ మొత్తంలోనే డబ్బులు చెల్లించినట్లు తెలుస్తోంది.
ఒకటి రెండేళ్లు కాదు.. ఎన్నో ఏళ్లుగా.. ఈ వజ్రాల వేట కొనసాగుతోంది. అనంతపురం-కర్నూలు జిల్లాల సరిహద్దు ప్రాంతంలో… ఏటా ఈ వేట సాగుతుంది. ఒక్కసారి.. ఒక వజ్రం దొరికిందంటే లక్షాదికారి కావొచ్చన్న ఆశతో.. ఎంతోమంది వాటికోసం వెతుకుతున్నారు. వజ్రం దొరకిందన్న సమాచారం తెలిస్తే చాలు.. వ్యాపారులకు సంబంధించిన ఏజెంట్లు ఇలా వాలిపోతున్నారు. పోటీ పడి మరీ వజ్రాలు కొనుగోలు చేస్తున్నారు. ప్రధానంగా జొన్నగిరి, పెరవలి,మదనంతపురం, పగిడిరాయి, బసినేపల్లి, జొన్నగిరి, రామలింగాయపల్లి వంటి ప్రాంతాల్లో ఏజెంట్లు మకాం వేశారు. ఇప్పటి వరకు 20 వరకు వజ్రాలు దొరికినట్లు సమాచారం.
ఇక్కడ వజ్రం దొరికిందని ప్రచారం తప్ప ఎలాంటి ఆధారం ఉండదు… వజ్రం దొరికినట్లు ఎలాంటి ఆధారాలు దొరకకపోవడంతో అధికారులు ఏమీ చేయలేక పోతున్నారు. వజ్రం దొరికినట్లు తెలుస్తుందే తప్ప అమ్మకం తర్వాత దొరకలేదని, వజ్రం కాదన్నారని చెబుతుండడంతో అధికారులు ఏమీ చేయలేక పోతున్నారు. వజ్రం దొరికితే పోలీసులు, రెవెన్యూ అధికారులకు వ్యాపారుల నుంచి కమీషన్ అందుతుందనే ఆరోపణలు కూడా ఉన్నాయి. అయితే అదంతా వట్టి మాటేనని అక్కడ్ పని చేసే అధికారులు చెబుతున్నారు.