Anand Mahindra: That girl will get a job in our company ఆ అమ్మాయికి మా కంపెనీలో ఉద్యోగమిస్తాం

మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా తరచుగా తనను ఆకర్షించిన విషయాలను సోషల్ మీడియాలో నెటిజన్లతో పంచుకుంటుంటారు. అంతేకాకుండా సృజనాత్మకత, ప్రతిభ ఉన్న నవతరాన్ని ప్రోత్సహించడంలో ఎల్లప్పుడూ ముందుండే ఆయన తాజాగా ఓ పోస్ట్ చేశారు.

మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా పలు విషయాలను సోషల్ మీడియాలో నెటిజన్లతో పంచుకుంటుంటారు. అంతేకాకుండా సృజనాత్మకత, ప్రతిభ ఉన్న నవతరాన్ని ప్రోత్సహించడంలో ఎల్లప్పుడూ ముందుండే ఆయన తాజాగా ఓ పోస్ట్ చేశారు.

అమెజాన్ వర్చువల్ వాయిస్ అసిస్టెంట్ ‘అలెక్సా’ సాయంతో కోతుల బారి నుంచి తనను, మేనకోడల్ని రక్షించుకున్న 13 ఏళ్ల బాలికకు తాను ఉద్యోగం ఇస్తానని మాటిచ్చారు. ‘‘సాంకేతిక పరిజ్ఞానానికి మనం బానిసలు అవుతామా, లేక మాస్టర్లుగానే ఉంటామా అనేది ఈ సాంకేతిక యుగంలో మన ముందున్న పెద్ద ప్రశ్న. కానీ ఈ బాలిక సమయస్ఫూర్తిని చూశాక సాంకేతికత ఎప్పటికీ మానవుడి ఆజ్ఞలను పాటించేదే అన్న ఆశాభావాన్ని కలిగిస్తుంది. ఆ బాలిక వ్యవహరించిన తీరు ఆశ్చర్యానికి గురి చేస్తోంది. తన విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత ఎప్పుడైనా కార్పొరేట్ ప్రపంచంలో పనిచేయాలని నిర్ణయించుకుంటే మేము మహీంద్రా రైజ్‌లో చేరమని ఆహ్వానిస్తున్నాము.!!”’’ అని పోస్టులో పేర్కొన్నారు. మహీంద్రా పోస్టు వైరలవ్వడంతో నెటిజన్లు ఆ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేశారు. ఓ నెటిజన్ స్పందిస్తూ ‘కచ్చితంగా టెక్నాలజీలో మాస్టర్లుగానే ఉంటాము’ అన్నారు. ‘ఆ సమయంలో ఆమెకు వచ్చిన ఐడియా అద్భుతం..నేటి తరం పిల్లల తెలివితేటలు మన ఊహకు కూడా అందట్లేదు’ అంటూ మరో నెటిజన్ స్పందించారు.

ఉత్తర్‌ప్రదేశ్‌లోని బస్తీ జిల్లాకు చెందిన నికిత అనే బాలిక తన మేనకోడలు వామిక (15 నెలలు)తో కలిసి ఆడుకుంటున్న సమయంలో వానరాల గుంపు వాళ్ల ఇంట్లోకి ప్రవేశించింది. ఇంట్లోని వస్తువులను విసిరేసి, ఆహారాన్ని పాడుచేస్తూ.. కోతులు గందరగోళం సృష్టించాయి. ఓ వానరం నికిత, వామికల వద్దకు వచ్చింది. ఆ సమయంలో కుటుంబసభ్యులెవరూ దగ్గర లేకపోయినా బాలిక భయపడలేదు. సమయస్ఫూర్తితో ఆలోచించింది. వెంటనే ఇంట్లో ఉన్న వర్చువల్ వాయిస్ అసిస్టెంట్ అలెక్సా గుర్తుకు వచ్చింది. అంతే ‘‘అలెక్సా.. శునకంలా మొరుగు’’ అని ఆదేశించింది. ఆ వెంటనే శునకం మొరుగుతున్నట్లుగా అలెక్సా పెద్దగా శబ్దాలు చేయడం ప్రారంభించింది. దాంతో భయపడిన కోతులు అక్కడి నుంచి పారిపోయాయి.