#Trending

10th Class Exams 2024 in Telugu States : తెలుగు రాష్ట్రాల్లో పదో తరగతి పరీక్షలు ప్రారంభం.. ఎగ్జాం సెంటర్ల వద్ద 144 సెక్షన్‌ అమలు

తెలుగు రాష్ట్రాల్లో పదో తరగతి పరీక్షలు సోమవారం (మార్చి 18) ఉదయం 9.30 గంటలకు ప్రారంభమయ్యాయి. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా 3,473 కేంద్రాల్లో పరీక్షలు మొదలయ్యాయి. మొత్తం 6,23,092 మంది విద్యార్ధులు పరీక్షలు రాయనున్నారు. వీరిలో 1,02,528 మంది గతంలో పదో తరగతి ఫెయిల్‌ అయిన విద్యార్ధులు మళ్లీ పరీక్ష ఫీజు చెల్లించి పరీక్షలకు హాజరు కానున్నారు. ఉదయం 9.30 గంటల నుంచి..

హైదరాబాద్‌, మార్చి 18: తెలుగు రాష్ట్రాల్లో పదో తరగతి పరీక్షలు సోమవారం (మార్చి 18) ఉదయం 9.30 గంటలకు ప్రారంభమయ్యాయి. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా 3,473 కేంద్రాల్లో పరీక్షలు మొదలయ్యాయి. మొత్తం 6,23,092 మంది విద్యార్ధులు పరీక్షలు రాయనున్నారు. వీరిలో 1,02,528 మంది గతంలో పదో తరగతి ఫెయిల్‌ అయిన విద్యార్ధులు మళ్లీ పరీక్ష ఫీజు చెల్లించి పరీక్షలకు హాజరు కానున్నారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్షా సమయంగా అధికారులు నిర్దేశించారు. రాష్ట్రంలో సమస్యాత్మక పరీక్షా కేంద్రాలుగా గుర్తించిన 130 సెంటర్లలో సీసీ టీవీ కెమెరాల నిఘాను ఏర్పాటు చేశారు. మాల్‌ ప్రాక్టీస్‌ను నిరోధించేందుకు క్యూఆర్‌ కోడ్‌లు ముద్రించిన ప్రశ్నపత్రాలను విద్యార్థులకు అందించారు. ప్రస్తుతం విద్యార్ధులంతా పరీక్ష కేంద్రాల్లో పరీక్షలు రాస్తున్నారు.

ఇక తెలంగాణలోనూ పదోతరగతి పరీక్షలు ఈ రోజు ఉదయం 9.30 గంటలకు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. ఏప్రిల్‌ 2 వరకు ఈ పరీక్షలు కొనసాగనున్నాయి. ఈసారి 5 నిమిషాలు ఆలస్యంగా వచ్చినా అనుమతిస్తామని అధికారులు తెలపడంతో విద్యార్ధులు సంతోషం వ్యక్తం చేశారు. దీంతో అధికారులు 9.35 నిమిషాల వరకు విద్యార్ధులను ఆయా పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించారు. రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిన 2,676 పరీక్ష కేంద్రాల్లో పరీక్షలు జరుగుతున్నాయి. దాదాపు 5.05 లక్షల మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాస్తున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రెండు రాష్ట్రాల్లో హాల్‌ టికెట్లు చూపించిన విద్యార్ధులకు ఆర్టీసీ ఉచిత ప్రయాణం కల్పిస్తోంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *