Withdrawal of Israeli troops ..Returning Palestinians : ఇజ్రాయెల్ సేనల ఉపసంహరణ,,తిరిగొస్తున్న పాలస్తీనీయులు..

దక్షిణ గాజాలో ఖాన్ యూనిస్ ప్రాంతం నుంచి తమ సైన్యాన్ని ఉపసంహరించుకుంటున్నట్లు ఇజ్రాయెల్ రక్షణ దళాలు ప్రకటించాయి.

ఇంటర్నెట్ డెస్క్: దక్షిణ గాజాలో ఖాన్ యూనిస్ ప్రాంతం నుంచి తమ సైన్యాన్ని ఉపసంహరించుకుంటున్నట్లు ఇజ్రాయెల్ రక్షణ దళాలు ప్రకటించాయి. దీంతో కొన్ని నెలలుగా తమ నివాసాలకు దూరంగా తలదాచుకున్న వేల కుటుంబాలు సొంత గూటికి తిరుగు పయనమయ్యాయి. నగరంలో ప్రస్తుతం ఎటుచూసినా విధ్వంసమే కనిపిస్తోంది. పాఠశాలలు, ఆసుపత్రులు కూడా పూర్తిగా దెబ్బతిన్నాయి. ఒకప్పుడు అపార్టుమెంట్లు, భారీ భవంతులు, వాణిజ్య సముదాయాలతో కళకళలాడిన ఖాన్ యూనిస్.. ఇజ్రాయెల్ సేనల దాడులతో నామరూపాల్లేకుండా పోయింది.

ఈ నగర జనాభా 14 లక్షలు. గాజా జనాభాలో సగం ఇక్కడే ఉండేది. గత అక్టోబర్ 7న గాజాపై యుద్ధం మొదలుపెట్టిన ఇజ్రాయెల్.. డిసెంబర్‌లో ఖాన్ యూనిస్‌పైకి సేనలను పంపించింది. హమాస్ ఉగ్రవాదులకు కీలక స్థావరంగా ఉన్న ఈ నగరాన్ని జల్లెడ పట్టింది. బందీలుగా చేసుకున్న వారిని ఈ నగరంలోనే దాచిపెట్టినట్లు భావించిన ఇజ్రాయెల్ సైన్యం.. ముష్కరులు తలదాచుకున్నట్లు అనుమానించిన సొరంగాలను ధ్వంసం చేసింది. ఈ క్రమంలో అక్కడి ప్రధాన ఆసుపత్రిపైనా దాడులు చేసింది. ఈ ఆపరేషన్‌లో వేలమంది హమాస్ ఉగ్రవాదులు హతమైనట్లు ఇజ్రాయెల్ వెల్లడించింది. అయితే, దాడుల నేపథ్యంలో లక్షల మంది స్థానికులు సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోయారు. నగరం నుంచి తమ బలగాలను ఉపసంహరించుకుంటున్నట్లు తాజాగా ఇజ్రాయెల్ ప్రకటించిన వెంటనే.. సైకిళ్లు, నడక మార్గంలో వేల మంది ఇంటిబాట పట్టారు.