Voice of protests against CAA

మూడు దేశాల ముస్లిమేతర శరణార్థులకు పౌరసత్వం కల్పించే పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ-2019)పై మంగళవారం సయితం నిరసనలు భగ్గుమన్నాయి.
దిల్లీ: మూడు దేశాల ముస్లిమేతర శరణార్థులకు పౌరసత్వం కల్పించే పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ-2019)పై మంగళవారం సయితం నిరసనలు భగ్గుమన్నాయి. పలువురు విపక్ష నేతలు కేంద్ర నిర్ణయాన్ని తప్పుబట్టారు. అస్సాంలో నిరసనకారులు, విద్యార్థులు రోడ్లపైకి చేరుకుని ఆందోళనలు చేపట్టారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్‌షాల దిష్టిబొమ్మలను దహనం చేశారు. కాంగ్రెస్ కార్యకర్తలు గువాహటిలో రాజ్‌భవన్ ముందు బైఠాయించి సీఏఏ ప్రతులను కాల్చివేశారు. పలు జిల్లాల్లో దుకాణాలు, వాణిజ్య సంస్థలు మూతపడ్డాయి. విద్యార్థి సంఘాలు, 30 రాజకీయేతర స్వదేశీ సంస్థలు కలిసి కాగడాల ప్రదర్శన నిర్వహించాయి. జాతీయ పౌర పట్టిక (ఎన్‌ఆర్‌సీ)కి దరఖాస్తు చేయని ఏ ఒక్కరికి పౌరసత్వం లభించినా తన పదవికి రాజీనామా చేస్తానని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ అన్నారు.
దిల్లీలో 55 మంది విద్యార్థుల నిర్బంధం
సీఏఏ అమలును వెనక్కు తీసుకోవాలంటూ దిల్లీలోని జామియా మిలియా ఇస్లామియా విశ్వవిద్యాలయ విద్యార్థులు ఆందోళనకు దిగారు. నాలుగు సంవత్సరాల క్రితం సీఏఏ వ్యతిరేక ఆందోళనల కేసుల్లో అరెస్టైన విద్యార్థులను విడుదల చేయాలని, వారిపై కేసులన్నింటినీ ఉపసంహరించుకోవాలని డిమాండు చేశారు. 55 మంది విద్యార్థులను పోలీసులు నిర్బంధంలోకి తీసుకున్నారు.
ఎన్‌ఆర్‌సీకి తొలిఅడుగు ఇది: మమత
కేంద్రం చర్యలు పౌరసత్వాన్ని ఇచ్చేందుకు కాకుండా వారి హక్కును లాక్కునేందుకు ఆడుతున్న నాటకమని పశ్చిమబెంగాల్ సీఎం మమతాబెనర్జీ ఆరోపించారు. జాతీయ పౌరపట్టిక (ఎన్‌ఆర్‌సీ) అమలుకు ఇది తొలి అడుగు అని చెప్పారు. ‘ఇది మైనారిటీలను, బెంగాలీలను దేశం నుంచి పంపించేందుకు వేసిన పన్నాగం. బెంగాల్‌ను విభజించే కుట్ర’ అని మండిపడ్డారు. దరఖాస్తు చేయడానికి ముందు పదేపదే ఆలోచించుకోవాలని సూచించారు. 2015 తర్వాత మన దేశంలోకి వచ్చినవారి పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. తానున్నంతవరకు బెంగాల్ నుంచి ఎవరినీ వెళ్లగొట్టలేరని చెప్పారు.
ముస్లింలే భాజపా లక్ష్యం: ఒమర్
ముస్లింలు భాజపాకు ఎప్పటినుంచో లక్ష్యంగా ఉన్నారని, సీఏఏలో కూడా అదే జరిగిందని నేషనల్ కాన్ఫరెన్స్ ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా ఆరోపించారు. మరో విభజనను సృష్టించడానికే సీఏఏ అమలు చేస్తున్నారని జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ అన్నారు. ప్రజల మధ్య విభజన సృష్టించడానికే కేంద్రం సీఏఏను అమలు చేస్తోందన్నారు. పౌరసత్వాన్ని మతపరమైన గుర్తింపుతో ముడిపెట్టడం ద్వారా రాజ్యాంగంలోని లౌకికవాదాన్ని సీఏఏ ఉల్లంఘిస్తోందని సీపీఎం పొలిట్‌బ్యూరో ఆరోపించింది.
విపక్షాల్లో మానవత్వం చచ్చిపోయిందా?: అనురాగ్ ఠాకుర్
‘పొరుగు దేశాల్లోని మతపరమైన మైనారిటీల హక్కును లాక్కోవడానికి విపక్షాలు ఎందుకంత ఆరాటపడుతున్నాయో నాకర్థం కావటంలేదు. విపక్షాల్లో మానవత్వం చచ్చిపోయిందా? హింసకు గురైన హిందూ కుటుంబాలు ఎక్కడకు వెళతాయి? వారిపై పట్టపగలే అఘాయిత్యాలు జరుగుతున్నాయి. బలవంతపు పెళ్లిళ్లు చేసుకోవాల్సి వస్తోంది’ అని కేంద్రమంత్రి అనురాగ్ ఠాకుర్ తెలిపారు.