Tamilisai vs. Tamilachi

చెన్నై: తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మరోసారి ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టిన వియం తెలిసిందే. బీజేపీ తరపున తమిళనాడు నుంచి ఆమె లోక్‌సభ బరిలో నిలిచారు. గతంలో ఎమ్మెల్యే, ఎంపీగా పోటీచేసి ఓటమిచెందిన తమిళిసై.. మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యారు. చెనై సౌత్ టికెట్‌ను ఆమెకు కేటాయించింది పార్టీ అధిష్టానం. ఈ క్రమంలో సోమవారం తమిళిసై నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా అనూహ్య పరిణామం జరిగింది.
అదే సమయంలో సిట్టింగ్ ఎంపీ, సమీప ప్రత్యర్ధి తమిళచ్చి తంగపాండియన్ నామినేషన్ వేసేందుకు అక్కడికి వచ్చారు. తమిళిసై నామినేషన్ వేసి బయటకు వస్తుండగా డీఎంకే నేత ఎదురుపడ్డారు. ఈ క్రమంలో ఇద్దరు మహిళా నేతలు నవ్వుతూ.. ఒకరినొకరు ఆలింగనం చేసుకున్నారు. ఇద్దరు అప్యాయంగా పలకరించుకున్నారు. ఇది చూసిన అక్కడున్నవారంతా కాసేపు షాక్‌కు గురయ్యారు. డీఎంకే, బీజేపీ మధ్య తీవ్ర రాజకీయ పోరు నెలకొన్న వేళ ఇలా ఇద్దరు నేతలు ఆప్యాయంగా పలకరించుకోవడం అందరినీ విస్మయానికి గురి చేసింది.
కాగా సౌత్ చెన్నైలో బీజేపీ నుంచి తమిళిసై, డీఎంకే నుంచి సిట్టింగ్ ఎంపీ తమిళచ్చి, అన్నాడీఎంకే నుంచి డాక్టర్ జయవర్దన్ పోటీలో నిలిచారు. గత ఎన్నికల్లో చెన్నై సౌత్ నుంచి తమిళచ్చి ఏకంగా 1.40 లక్షల ఓట్ల మెజారిటీతో గెలిచారు. 2014లో చెన్నై సౌత్ నుంచి గెలిచిన జయవర్థన్.. 2019 లో ఓటమి పాలయ్యారు. తాజాగా మూడోసారి ఇక్కడి నుంచి మరోసారి బరిలో నిలిచారు. ఈ క్రమంలో స్థానికంగా పోరు ఆసక్తికరంగా మారింది.