Russia Mall Terror Attack: Massive terrorist attack in Russia.. 60 people died.. Putin’s key announcement.. రష్యాలో భారీ ఉగ్రదాడి.. 60 మంది మృతి.. పుతిన్ కీలక ప్రకటన..

Moscow concert attack: రష్యాలో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. మాస్కోలోని కాన్సర్ట్ హాల్‌పై ముష్కరులు భారీ ఉగ్ర దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో 60మంది మృతి చెందారు. 100మందికి పైగా తీవ్రగాయాలయ్యాయి. మాస్కోలోని కాన్సర్ట్ హాల్ లోకి ప్రవేశించిన ఉగ్రవాదులు.. థియేటర్‌లోకి వెళ్లి విచక్షణారహితంగా కాల్పులు జరిపారు.
Moscow concert attack: మాస్కో కాల్పుల మోతతో దద్దరిల్లింది..క్రాకస్ సిటీ కాన్సర్ట్ హాల్‌లోకి వచ్చిన సాయుధులు మెషిన్‌గన్లతో విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. బాంబులు విసరుతూ బీభత్సం సృష్టించారు. ఈ ఘటనలో 60మందికి పైనే చనిపోయారు.. వందమందికిపైగా గాయాపడ్డారు. ప్రముఖ రష్యన్ రాక్ బ్యాండ్ ఈ కన్సర్ట్ హాల్‌లో ప్రొగ్రాం నిర్వహిస్తుండగా ఈ ఘటన జరిగింది. కాసేపట్లో షో మొదలౌతుందనగా ఒక్కసారిగా ఉగ్రవాదులు మిలటరీ దుస్తుల్లో చొచ్చుకొచ్చారు. ఒక్కసారిగా ఫైరింగ్ ఓపెన్ చేశారు.. అప్పటి వరకూ ప్రశాంతంగా ఉన్న నగర వాతావరణం ఒక్కసారిగా రక్తసిక్తమైంది. పలువురు భయాందోళనలతో ఘటనా స్థలం నుంచి పారిపోతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. మ్యూజిక్ కన్సర్ట్ ప్రాంగణమంతా మంటలు, పొగలతో కమ్ముకుపోయింది. ఇక హాల్‌లో చిక్కుకున్నవారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.. అటాక్ తర్వాత ఉగ్రవాదులు తప్పించుకున్నారు. వారి కోసం మాస్కోని జల్లెడపడుతున్న ఆర్మీ..ఒకర్ని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. మిగిలిన వారి కోసం గాలిస్తున్నారు..
ఉగ్రదాడితో ఒక్కసారిగా రష్యాలో అలజడి రేగింది. మాస్కో ఎటాక్‌పై పుతిన్ కీలక ప్రకటన చేశారు. ఘటన వెనుక ఎవరున్నా భారీ మూల్యం చెల్లించుకుంటారని హెచ్చరించారు పుతిన్.. మాస్కో దాడిని ఖండించాయి అమెరికా, ఐక్యరాజ్యసమితి, ఈయూ..అయితే రష్యాలో ఉగ్రదాడి జరిగే అవకాశం ఉందని రష్యాలోని అమెరికా ఎంబసీ వారం క్రితమే హెచ్చరించింది..
గత రెండు దశాబ్దాల్లో రాష్యాలో ఇదే అతిపెద్ద ఉగ్రదాడిగా భావిస్తున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో రష్యా అధ్యక్షుడిగా వ్లాదిమిర్ పుతిన్ విజయం సాధించారు..అధ్యక్షుడిగా ఎన్నికైన కొద్ది రోజులకే రష్యా రాజధానిలో ఉగ్రదాడి జరగడం చర్చనీయాంశంగా మారింది.
ఈ ఘటన రష్యాను వణికించింది. ఘటనా స్థలంలో బాధితుల హాహాకారాలతో భీకర వాతావరణం నెలకొంది. క్షతగాత్రులను అధికారులు ఎయిర్‌లిఫ్ట్ చేశారు. సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.
మేమే చేశాం.. ఐసీస్
కాగా..మాస్కోలోని కాన్సర్ట్ హాల్ పై దాడి తామే చేశామని ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ శుక్రవారం తెలిపింది. దాడి చేసినవారు సురక్షితంగా తమ స్థావరాలకు వెళ్లిపోయారని ఐఎస్ ప్రకటించిన నేపథ్యంలో రష్యా ఆర్మీ (రష్యా నేషనల్ గార్డ్) అప్రమత్తమైంది.. ఉగ్రవాదుల కోసం అంతటా గాలిస్తున్నారు.