Liquor Scam : kavitha jail ? or Bail? లిక్కర్ స్కాంలో కవిత: బెయిలా? జైలా? లేకుంటే.. అప్‌డేట్స్

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు.. కోర్టుకి కవిత.. అప్‌డేట్స్
ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో ఆరోపణలను ఎదుర్కొంటూ ఈడీ కస్టడీలో ఉన్న బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కస్టడీ సోమవారంతో ముగిసింది. ఈ నేపథ్యంలో ఇవాళ ఆమెను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు ఢిల్లీలోని రౌజ్ అవెన్యూ కోర్టులో హాజరుపరచనున్నారు.
►అయితే ఆమె కస్టడీని మరోసారి పొడిగించాలని ఈడీ కోరే అవకాశం ఉండగా.. మరోవైపు సుప్రీం కోర్టు సూచనతో ఆమె వేసిన బెయిల్ పిటిషన్‌పైనా ఇవాళ అదే కోర్టులో విచారణ జరిగే అవకాశం కనిపిస్తోంది. ఒకవేళ కోర్టు గనుక కస్టడీ పొడిగించకపోతే ఆమెను జైలుకు తరలించే అవకాశాలు లేకపోలేదు.
►లిక్కర్ స్కాం కేసులో.. కవితను మొత్తం పది రోజులపాటు (తొలిసారి కస్టడీ వారం, మలి విడత కస్టడీ మూడు రోజులు) కవితను విచారించింది ఈడీ. ఢిల్లీ లిక్కర్ కుంభకోణం ప్రారంభ దశ నుంచి ఒక్కో పాయింట్‌ను కవితను అడుగుతూ అధికారులు విచారించారు. ఈ కేసులో అప్రూవర్‌లుగా మారిన వాళ్లు ఇచ్చిన సమాచారాన్ని ఆమె ముందు ఉంచి ఒక్కో ప్రశ్న అడిగారు. ఇతర నిందితులతో ఆమె జరిపిన వాట్సాప్ ఛాటింగ్‌లపై ఆరా తీశారు. నిందితులతో ఏరకమైన సంబంధాలు ఉన్నాయి.. ఎవరెవరిని ఎక్కడెక్కడ కలిశారు.. లాంటి విషయాలపై సమాధానం రాబట్టేందుకు యత్నించారు.
►కొన్ని ప్రశ్నలకు సమాధానాలను ఇచ్చిన కవిత, మరికొన్ని ప్రశ్నలకు సమాధానాలను దాటవేసినట్లు సమాచారం. మొత్తంగా కీలక సమాచారమే ఆమె నుంచి రాబట్టినట్లు ఈడీ వర్గాలు చెబుతున్నాయి.
► తన అరెస్టు అక్రమమంటూ తొలి నుంచి చెబుతున్న కవిత.. న్యాయపోరాటానికి దిగారు. కవిత వేసిన రిట్ పిటిషన్‌ను తోసిపుచ్చిన సుప్రీం కోర్టు.. రాజకీయ నేతలు అయినంత మాత్రాన మినహాయింపు ఉండబోదని, విచారణను ఎదుర్కోవాల్సిందేనని స్పష్టం చేసింది. ఈ క్రమంలో ట్రయల్ కోర్టులోనే బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోవాలని, మహిళ కాబట్టి ఆమె పిటిషన్‌ను త్వరగతిన పరిశీలించాలని కింది కోర్టుకు(రౌస్ అవెన్యూ కోర్టు) సూచించింది.
► ఇవాళ రౌస్ అవెన్యూ కోర్టులో కవిత బెయిల్ పిటిషన్ విచారణకు వచ్చే అవకాశం ఉంది. అదే సమయంలో ఈడీ కస్టడీ పొడిగింపు కోరే ఛాన్స్ ఉంది. ఒకవేళ ఈడీ కస్టడీకి ఇవ్వకుంటే ఆమెను జైలుకు తరలించే అవకాశాలున్నాయి. ఈ క్రమంలో కవితకు జైలా? బెయిలా? అన్నది ఆసక్తికరంగా మారింది.
► ఇక ఈ కేసులో కింగ్‌పిన్‌గా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను పేర్కొన్న ఈడీ.. ఆయన్ని అరెస్ట్ చేసి కస్టడీలో విచారణ జరుపుతోంది. ఈ క్రమంలో ఇవాళ కవిత కస్టడీని మరో రెండు రోజులు పొడిగింపు అడిగి.. కవితను, కేజ్రీవాల్‌ను కలిపి ఈడీ విచారించవచ్చని తెలుస్తోంది.
► ఈ కుంభకోణంలో రూ. వంద కోట్లు చేతులు మారాయని ఆరోపిస్తున్న ఈడీ ..ఈ స్కామ్‌లో పాత్రపై కేజ్రీవాల్, కవితను ఎదురెదురుగా కూర్చోబట్టి ప్రశ్నిస్తేనే మరిన్ని వివరాలు రాబట్టవచ్చనే ఆలోచనలో ఈడీ వర్గాలున్నట్లు సమాచారం.