#Top Stories

India-China news : అరుణాచల్‌ మాదే.. మీ పిచ్చివాదన వాస్తవాలను మార్చదు: చైనాకు భారత్‌ చురక

ప్రధాని మోదీ ‘అరుణాచల్‌’ పర్యటనపై నోరు పారేసుకున్న చైనాకు భారత్‌ గట్టిగా బదులిచ్చింది. ‘మీ అక్కసు వాస్తవాలను మార్చలేదంటూ’ డ్రాగన్‌కు చురకలంటించింది.

దిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) ఇటీవల అరుణాచల్‌ప్రదేశ్‌ (Arunachal Pradesh)లో పర్యటించడంపై చైనా (China) తన అక్కసు వెళ్లగక్కిన విషయం తెలిసిందే. ‘జాంగ్‌నన్‌’ ప్రాంతం తమ భూభాగమని, అక్కడ భారత్‌ వేస్తోన్న అడుగులు.. సరిహద్దు వివాదాన్ని మరింత క్లిష్టతరం చేస్తాయని డ్రాగన్‌ విదేశాంగ ప్రతినిధి వాంగ్‌ వెన్‌బిన్‌ నోరుపారేసుకున్నారు. ఈ విషయమై న్యూదిల్లీతో దౌత్యపరంగా నిరసనను తెలియజేసినట్లు పేర్కొన్నారు. దీంతో ఈ వ్యాఖ్యలకు భారత విదేశాంగ శాఖ (MEA) దీటుగా బదులిచ్చింది.

‘‘ప్రధాని మోదీ అరుణాచల్‌ పర్యటనను ఉద్దేశిస్తూ చైనా చేసిన వ్యాఖ్యలను మేం తీవ్రంగా ఖండిస్తున్నాం. భారత్‌లోని ఇతర రాష్ట్రాల మాదిరిగానే అరుణాచల్‌ ప్రదేశ్‌లోనూ మా నేతలు పర్యటనలు చేపడుతారు. ఈ పర్యటనలను వ్యతిరేకించడం, భారత అభివృద్ధి ప్రాజెక్టులపై అభ్యంతరం వ్యక్తం చేయడం సహేతుకం కాదు. ఇది వాస్తవాలను ఏమాత్రం మార్చదు. అరుణాచల్‌ ఎప్పటికీ భారత్‌లో అంతర్భాగమే. ఈ విషయాన్ని చైనాకు ఇప్పటికే చాలాసార్లు స్పష్టంగా చెప్పాం’’ అని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్‌ జైస్వాల్‌ మంగళవారం అధికారిక ప్రకటనలో వెల్లడించారు.

అరుణాచల్‌లో ఇటీవల ప్రధాని మోదీ పర్యటన చేపట్టిన విషయం తెలిసిందే. చైనా- భారత్‌ సరిహద్దులోని తవాంగ్‌కు సైనిక బలగాలను, సాయుధ సంపత్తిని తరలించేందుకు ఉపయోగపడే ‘సేలా’ సొరంగ మార్గాన్ని ఆయన ప్రారంభించారు. అయితే, ఈ రాష్ట్రాన్ని చైనా ‘జాంగ్‌నన్‌ (దక్షిణ టిబెట్‌)’గా పేర్కొంటోంది. ఈ క్రమంలోనే మోదీ పర్యటనపై అక్కసు వెళ్లగక్కింది. అది తమ భూభాగమంటూ మళ్లీ పాత పాటే పాడింది.

‘‘జాంగ్‌నన్‌ ప్రాంతం చైనాలో భాగం. చట్టవిరుద్ధంగా ఏర్పాటుచేసిన అరుణాచల్‌ను మేం ఎన్నడూ గుర్తించలేదు. దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఇరుదేశాల సరిహద్దు సమస్య ఇంకా పరిష్కారం కాలేదు. జాంగ్‌నన్‌ను అభివృద్ధి చేసే హక్కు ఆ దేశానికి లేదు. చైనా- భారత్‌ సరిహద్దులోని తూర్పు ప్రాంతంలో ఆ దేశ ప్రభుత్వాధినేత పర్యటనపై తీవ్ర అసంతృప్తితో ఉన్నాం. ఈ విషయమై మా నిరసనను తెలియజేశాం’’ అని డ్రాగన్‌ పేర్కొనడం గమనార్హం.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *