Earthquake In Newyork : భూకంపంతో వణికిన న్యూయార్క్


అమెరికాలోని న్యూయార్క్ ప్రాంతం శుక్రవారం ఉదయం సంభవించిన భూకంపంతో ఉలిక్కిపడింది.
న్యూయార్క్: అమెరికాలోని న్యూయార్క్ ప్రాంతం శుక్రవారం ఉదయం సంభవించిన భూకంపంతో ఉలిక్కిపడింది. ఆకాశహర్మ్యాల్లో ఉంటున్నవారు ఒక్కసారిగా తీవ్ర భయాందోళనకు గురయ్యారు. దేశ తూర్పు, ఈశాన్య ప్రాంతంలో ప్రకంపనల తీవ్రత కనిపించింది. ఆస్తి నష్టం వివరాలు తెలియరాలేదు. సాధారణంగా ఈ ప్రాంతంలో అత్యంత అరుదుగా భూకంపాలు సంభవిస్తుంటాయి. అలాంటిది ఒక్కసారిగా వచ్చిన భూకంపం సుమారు 4.2 కోట్ల మందిని కలవరపాటుకు గురిచేసింది.

శుక్రవారం ఉదయం 10.23 గంటలకు (అమెరికా కాలమానం ప్రకారం) 4.8 తీవ్రతతో భూకంపం సంభవించిందని అమెరికా భూభౌతిక పరిశోధన సంస్థ (యూఎస్‌జీఎస్) తెలిపింది. న్యూ జెర్సీలోని వైట్‌హౌస్ స్టేషన్‌కు సమీపంలో భూకంప కేంద్రాన్ని గుర్తించామని వెల్లడించింది. దీని ప్రభావంతో కొన్ని విమానాలను దారి మళ్లించారు. అత్యంత రద్దీగా ఉండే ఆమ్‌ట్రాక్ రైల్వే వ్యవస్థ తమ రైళ్ల వేగాన్ని తగ్గించింది. అధికారులు వంతెనలు, ఇతర ప్రధాన మౌలిక వసతులను తనిఖీ చేశారు. మన్‌హట్టన్, బ్రూక్లిన్‌లతోపాటు బాల్టిమోర్, ఫిలడెల్ఫియా, కనెక్టికట్, తూర్పు కోస్తాలోని ఇతర ప్రాంతాల్లో భూకంపం ప్రభావం కనిపించింది.

భద్రతా మండలి సమావేశానికి స్వల్ప ఆటంకం
ఐరాస భద్రతా మండలి సమావేశానికి భూకంపం కారణంగా స్వల్ప ఆటంకం ఏర్పడింది. గాజాలో పరిస్థితిపై చర్చించేందుకు ఐరాస దౌత్యవేత్తలు శుక్రవారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ప్రకంపనలు సంభవించాయి. ఆ వెంటనే భూకంపానికి సంబంధించిన అప్రమత్తత సందేశాలతో ఆ మందిరంలో ఉన్నవారి ఫోన్లు మోగాయి.