Delhi Encounter: దిల్లీలో అర్ధరాత్రి ఎన్కౌంటర్.. ముగ్గురు గ్యాంగ్స్టర్ల అరెస్ట్

Delhi Encounter: ఇటీవల ఓ వ్యక్తి హత్యకు కారణమైన హాశిమ్ ముఠాకు చెందిన ముగ్గురు గ్యాంగ్స్టర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
దిల్లీ: దేశ రాజధాని దిల్లీలో సోమవారం అర్ధరాత్రి దాటాక జరిగిన ఎన్కౌంటర్ కలకలం సృష్టించింది. ఈ ఘటనలో ముగ్గురు గ్యాంగ్స్టర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎదురుకాల్పుల్లో గాయపడిన వారికి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈశాన్య దిల్లీలోని అంబేడ్కర్ కాలేజీ సమీపంలో రాత్రి 1.30 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. ఇద్దరు పోలీసులకు సైతం స్వల్ప గాయాలయ్యాయి.
పోలీసుల వివరాల ప్రకారం.. హాశిమ్ ముఠాకు చెందిన ముగ్గురు సభ్యులు మార్చి 9న అర్బాజ్ అనే వ్యక్తిని కాల్చి చంపారు. వారి కదలికలపై పోలీసులకు సోమవారం సమాచారం అందింది. పట్టుకోవడానికి వెళ్లగా.. గ్యాంగ్స్టర్లు కాల్పులకు తెగబడ్డారు. దీంతో ఆత్మరక్షణ కోసం పోలీసులు ఎదురుకాల్పులు ప్రారంభించారు. ఈ క్రమంలో దుండగుల కాళ్లకు గాయాలయ్యాయి. వెంటనే వారిని పట్టుకొని ఆస్పత్రికి తరలించినట్లు డీసీపీ జాయ్ టిర్కీ తెలిపారు. హత్య, హత్యాయత్నం కింద కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించామన్నారు.