Biden Presenets New Casefire Plan For Israel: ఇజ్రాయెల్, హమాస్ మధ్య కాల్పుల విరమణకు కొత్త ఒప్పందం!

ఇజ్రాయెల్, హమాస్ మధ్య ఉద్రిక్తతలను చల్లార్చే దిశగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కొత్త ఒప్పంద ప్రతిపాదనను తీసుకొచ్చారు. బందీల విడుదలతోపాటు కాల్పుల విరమణకు అందులో పిలుపునిచ్చారు.
వాషింగ్టన్: ఇజ్రాయెల్, హమాస్ మధ్య ఉద్రిక్తతలను చల్లార్చే దిశగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కొత్త ఒప్పంద ప్రతిపాదనను తీసుకొచ్చారు. బందీల విడుదలతోపాటు కాల్పుల విరమణకు అందులో పిలుపునిచ్చారు. ఈ ప్రతిపాదనకు ఇజ్రాయెల్ ఇటీవల అంగీకారం తెలిపినట్లు చెప్పారు. హమాస్ కూడా దానికి ఆమోదముద్ర వేయాలని కోరారు. బైడెన్ ప్రతిపాదించిన ఒప్పందంలో మూడు దశలు ఉంటాయి. మొదటి దశ ఆరు వారాలు కొనసాగుతుంది. ఇందులో ఉభయపక్షాలు పూర్తిస్థాయిలో కాల్పుల విరమణను పాటించాలి. గాజాలోని జన బాహుళ్య ప్రాంతాల నుంచి ఇజ్రాయెల్ బలగాలు వెనుదిరగాలి. వందల మంది పాలస్తీనా ఖైదీలను ఇజ్రాయెల్ విడుదల చేయాలి. ప్రతిగా మహిళలు, వృద్ధులు సహా పలువురు బందీలను హమాస్ అప్పగించాలి. రెండో దశలో- సైనికులు సహా సజీవ ఇజ్రాయెలీ బందీలందరినీ హమాస్ విడిచిపెట్టాలి. గాజా నుంచి ఇజ్రాయెల్ బలగాలు పూర్తిగా వెనక్కి వచ్చేయాలి. మూడో దశలో- గాజాలో పునర్నిర్మాణ పనులు భారీస్థాయిలో ప్రారంభమవుతాయి. బందీలుగా ఉన్నప్పుడు ప్రాణాలు కోల్పోయినవారి భౌతిక అవశేషాలను వారి కుటుంబసభ్యులకు అప్పగించాలి. ఇజ్రాయెలీలు, పాలస్తీనీయుల మెరుగైన భవిష్యత్తుకు దోహదపడే ఈ ప్రతిపాదనను ఖతార్ ద్వారా హమాస్‌కు చేరవేసినట్లు అమెరికా తెలిపింది.