Arvind Kejriwal: Delhi liquor scam case / ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సీఎం కేజ్రీవాల్‌కు ఊరట.. బెయిల్ మంజూరు..

ఢిల్లీ లిక్కర్ స్కామ్ సెగలు రేపుతోంది. ఇప్పటికే పలువురిని అదుపులోకి తీసుకున్న ఈడీ అధికారులు.. తాజాగా ఎమ్మెల్సీ కవితను కూడా అరెస్టుచేశారు. ఇవాళ కోర్టులో హాజరుపర్చనున్నారు. ఈ క్రమంలోనే ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు శనివారం కోర్టు నుంచి ఊరట లభించింది.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ సెగలు రేపుతోంది. ఇప్పటికే పలువురిని అదుపులోకి తీసుకున్న ఈడీ అధికారులు.. తాజాగా ఎమ్మెల్సీ కవితను కూడా అరెస్టుచేశారు. ఇవాళ కోర్టులో హాజరుపర్చనున్నారు. ఈ క్రమంలోనే ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు శనివారం కోర్టు నుంచి ఊరట లభించింది. రౌస్ అవెన్యూ కోర్టుకు శనివారం కేజ్రీవాల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వాదోపవాదాల తర్వాత ధర్మాసనం కేజ్రీవాల్ కు బెయిల్ మంజూరు చేసింది. రూ.లక్ష పూచీకత్తు, రూ.15 వేలు బాండ్‌పై రౌస్ అవెన్యూ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. కాగా.. ఇదే కేసులో గతంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణకు హాజరుకావాలని కేజ్రీవాల్‌కు 8 సార్లు సమన్లు జారీ చేసింది. అయినప్పటికీ.. ఒక్కసారి కేజ్రీవాల్ విచారణకు హాజరుకాలేదు. ఈ క్రమంలో కేజ్రీవాల్ విచారణకు సహకరించడంలేదని కోర్టుకు ఈడీ ఫిర్యాదు చేసింది. ఈడీ ఫిర్యాదుతో కేజ్రీవాల్‌కు కోర్టు సమన్లు జారీ చేయడంతో.. విచారణకు హాజరు కాగా.. కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
కాగా.. అంతకుముందు శుక్రవారం, ఎక్సైజ్ పాలసీ స్కామ్‌కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ED సమన్లను విస్మరించినందుకు ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌పై మేజిస్ట్రేట్ కోర్టు ముందు విచారణను నిలిపివేసేందుకు రాజధాని ఢిల్లీలోని సెషన్స్ కోర్టు నిరాకరించింది. రౌస్ అవెన్యూలోని అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ దివ్య మల్హోత్రా కోర్టులో కేసు విచారణ జరుపుతున్నారు. ఈడీ తరపున అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు కోర్టులో వాదించగా.. అరవింద్ కేజ్రీవాల్ తరఫున ఇద్దరు లాయర్లు రమేష్ గుప్తా, రాజీవ్ మోహన్ వాదించారు.
ఇదిలాఉంటే.. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఇవాళ ఎమ్మెల్సీ కవితను రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపర్చనున్నారు. ఇప్పటికే కవితను అరెస్టు చేసి ఢిల్లీకి తరలించిన విషయం తెలిసిందే.