Arvind Kejriwal: 15 days judicial custody to Kejriwal.. కేజ్రీవాల్‌కు 15 రోజుల జ్యుడిషియల్ కస్టడీ

Arvind Kejriwal: దిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు జ్యుడిషియల్ కస్టడీని న్యాయస్థానం విధించింది.
దిల్లీ: మద్యం విధానానికి (Delhi Excise Scam Case) సంబంధించిన మనీలాండరింగ్ కేసులో దిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ కస్టడీని కోర్టు మరోసారి పొడిగించింది. ఈ కేసులో 15 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధిస్తూ రౌజ్ అవెన్యూ కోర్టు సోమవారం ఉత్తర్వులిచ్చింది. దీంతో ఆయనను తిహాడ్ జైలుకు తరలించనున్నారు.
ఈ కేసులో మార్చి 21న కేజ్రీవాల్‌ను ఈడీ (ED) అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అనంతరం కోర్టులో హాజరుపర్చగా.. తొలుత ఏడు రోజులు, ఆ తర్వాత నాలుగు రోజుల పాటు ఈడీ కస్టడీకి న్యాయస్థానం అప్పగించింది. సోమవారంతో ఆ కస్టడీ ముగియడంతో సీఎంను నేడు కోర్టు ఎదుట హాజరుపర్చారు. ఈ సందర్భంగా దర్యాప్తు సంస్థ తరఫున వాదనలు వినిపించిన అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు.. ఈడీ కస్టడీ పొడిగింపు కోరడం లేదని తెలిపారు. ఆయనను జ్యుడిషియల్ కస్టడీకి అప్పగించాలని కోరారు.
‘‘విచారణకు సీఎం సహకరించడం లేదు. ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం లేదు. దర్యాప్తును తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఉద్దేశపూర్వకంగానే ఆయన డిజిటల్ పరికరాల పాస్‌వర్డ్‌లను చెప్పడం లేదు. కొన్ని రోజుల తర్వాత ఆయనను మళ్లీ కస్టడీలోకి తీసుకుంటాం. అప్పటిదాకా జ్యుడిషియల్ కస్టడీ విధించాలి’’ అని ఈడీ వాదించింది. ఇందుకు న్యాయస్థానం అంగీకరించింది. దీంతో అధికారులు నేడే ఆయనను జైలుకు తరలించనున్నారు.
కోర్టు లోపలికి వెళ్లే ముందు కేజ్రీవాల్ మాట్లాడుతూ.. ‘‘ప్రధాని మోదీ చేస్తున్న చర్యలు దేశానికి మంచిది కాదు’’ అని వ్యాఖ్యానించారు. ఈ కేసులో ఇప్పటికే ఆప్ నేతలు మనీశ్ సిసోదియా, సంజయ్ సింగ్, భారాస ఎమ్మెల్సీ కవిత అరెస్టై తిహాడ్ జైల్లో ఉన్న సంగతి తెలిసిందే.