#Top Stories

Aadhaar Update: ఆధార్‌ ఉచిత అప్‌డేట్‌కు మరోసారి గడువు పొడిగింపు

ఆధార్‌లో వివరాలు ఉచితంగా అప్‌డేట్‌ చేసుకునేందుకు విధించిన గడువు తేదీని మరోసారి పొడిగిస్తున్నట్లు ఉడాయ్‌ తెలిపింది.

దిల్లీ: ఆధార్‌ (Adhaar) వివరాలను ఉచితంగా అప్‌డేట్‌ (Free Aadhaar Update) చేసుకునేందుకు కేంద్రం ఇచ్చిన గడువు మార్చి 14తో ముగియడంతో ‘భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ’ (UIDAI) కీలక నిర్ణయం తీసుకుంది. ఆధార్‌ ఉచిత అప్‌డేట్‌కు మరో మూడు నెలలు గడువు ఇస్తున్నట్టు వెల్లడించింది. ఈ మేరకు ఉడాయ్‌ ఎక్స్‌లో పోస్ట్‌ చేసింది. దీంతో జూన్‌ 14 వరకు ఉచితంగా ఆధార్‌లో మార్పులు చేసుకోవచ్చు. తొలుత 2023 మార్చి15 వరకు ఉన్న గడువును డిసెంబరు 14 వరకు పొడిగించింది. తర్వాత 2024 మార్చి 14 వరకు అప్‌డేట్‌ చేసుకునేందుకు అవకాశం కల్పించింది. తాజాగా మరోసారి గడువు తేదీని పొడిగించింది. ఆధార్‌ అప్‌డేట్‌ కోసం ప్రజల నుంచి విశేష స్పందన వస్తుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉడాయ్‌ ఓ ప్రకటనలో పేర్కొంది.

ఆధార్‌ తీసుకుని పదేళ్లు పూర్తయిన వారు తమ డెమోగ్రఫిక్‌ వివరాలు అప్‌డేట్‌ చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం ఉడాయ్‌ వెబ్‌సైట్‌లోకి లాగిన్‌ అయ్యి లేటెస్ట్‌ గుర్తింపు కార్డు, అడ్రస్‌ వివరాలను సబ్మిట్‌ చేయాలి. రేషన్‌ కార్డు, ఓటర్‌ ఐడీ, కిసాన్‌ ఫొటో పాస్‌బుక్‌, పాస్‌పోర్ట్‌ వంటివి గుర్తింపు, చిరునామా రెండింటికీ ధ్రువీకరణ పత్రాలుగా వినియోగించుకోవచ్చు. టీసీ, మార్క్‌షీట్‌, పాన్‌/ఇ-ప్యాన్‌, డ్రైవింగ్‌ లైసెన్స్‌ వంటివి గుర్తింపు ధ్రువీకరణ పత్రంగా ఉపయోగపడతాయని తెలిపింది. విద్యుత్‌, నీటి, గ్యాస్‌, టెలిఫోన్‌ బిల్లులను (మూడు నెలలకు మించని) చిరునామా ధ్రువీకరణ పత్రంగా వినియోగించ్చుకోవచ్చని ఉడాయ్‌ పేర్కొంది. ఉచిత సేవలు ‘మై ఆధార్‌’ పోర్టల్‌ ద్వారా మాత్రమే అందుబాటులో ఉంటాయని తెలిపింది. 

Leave a comment

Your email address will not be published. Required fields are marked *