TELANGANA : Internal dissensions in Congress : కాంగ్రెస్‌లో అంతర్గత విబేధాలు

కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విబేధాలు పార్టీ శ్రేణులను తీవ్ర కలవరానికి గురిచేస్తున్నాయి.
– ‘సుడా’ చైర్మన్‌కు అవమానం అంటూ సోషల్‌మీడియాలో ఆడియో వైరల్
– మంత్రి ‘పొన్నం’ తీరుపై శ్రేణుల్లో అసంతృప్తి

కరీంనగర్ అర్బన్, ఏప్రిల్ 15: కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విబేధాలు పార్టీ శ్రేణులను తీవ్ర కలవరానికి గురిచేస్తున్నాయి. పార్లమెంట్ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్నప్పటికీ కరీంనగర్ లోక్‌సభ అభ్యర్థి ఎవరో ప్రకటించక పోవడంతో అసంతృప్తికి గురవుతున్న నాయకులు, కార్యకర్తలు నేతల మధ్య ఆధిపత్యపోరుతో సోషల్ మీడియాలో తమ అసంతృప్తిని వెల్లడిస్తున్నారు. ఆదివారం రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కేంద్రంలోని బీజేపీ వైఫల్యాలు, విభజన హామీలపై చేపట్టిన దీక్ష పార్టీలోని నేతల మధ్య విబేధాలు మరింత భగ్గుమ న్నాయి. డీసీసీ కార్యాలయంలో చేపట్టిన దీక్షకు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడితో పాటు నగర కాంగ్రెస్ అధ్యక్షుడు, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డికి వేదికపై సముచిత స్థానం కల్పించకుండా కింద కూర్చోబెట్టడం, ఆయనను అవమానపరచడమే నంటూ యువజన కాంగ్రెస్ కరీంనగర్ అసెంబ్లీ అధ్యక్షుడు అబ్దుల్ రహమాన్ పోస్టు చేసిన ఆడియో సోషల్ మీడియాలో వైరల్ కావడం పార్టీలో చర్చనీయంశంగా మారింది. పార్లమెంట్ ఎన్నికలకు కేవలం 28 రోజుల ముందే జరిగిన ఈ సంఘటన పార్టీకి నష్టం కలిగిస్తుందని, మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యవహరించిన తీరు సరిగాలేదంటూ కార్యకర్తలు బాహటంగా విమర్శించడం పార్టీలో ఆందోళన కలిగిస్తున్నది. ఈ ఆడియోను పలు సామాజిక మాద్యమాల్లో పోస్ట్ చేయగా కాంగ్రెస్‌పార్టీకి చెందిన, పలు ఇతర వాట్సప్ గ్రూపులలో వైరల్ అయింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన గ్రూపులలో ఈ అడియోపై అటు మంత్రి అనుచరులు, ఇటు కోమటిరెడ్డి అనుచరుల మధ్య పోటాపోటీగా చాటింగ్ నడిచినట్లు సమా చారం. కాంగ్రెస్‌పార్టీ కష్టకాలంలో జెండా మోసిన నాయకుడిని అవమానించడం పద్ధతికాదని, ఇతర పార్టీల నాయకులను పార్టీలోకి తీసుకోవడంలో తప్పులేదుకాని, కష్టకాలంలో పార్టీ వెన్నంటి ఉన్న నాయకులకు సుముచిత గౌరవం ఇవ్వాలని, మళ్లీ ఇటువంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని అబ్దుల్ రహమాన్ తన ఆడియోలో పేర్కొన్నాడు. నగరంలో జరిగే అన్ని పార్టీ కార్యక్రమాలకు నగరశాఖ అధ్యక్షుడు అధ్యక్షత వహించాల్సి ఉండగా కనీసం వేదికపైకి ఆహ్వానించకపోవటం పట్ల నరేందర్‌రెడ్డి అనుచరులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. దీక్ష కార్యక్రమానికి తన అనుచరులతో చేరుకున్న నరేందర్‌రెడ్డిని వేదికపైకి ఆహ్వానించకపోవటంతో ఆయన వేదికముందు అనుచర నాయకులు, కార్యకర్తలతో కలిసి రెండు గంటలు అలాగే కూర్చున్నాడు. నరేందర్‌రెడ్డి గత నెలలో సుడా చైర్మన్‌గా నియామకమైనప్పటి నుంచి మంత్రితో సయోధ్య లేదనే చర్చ నడుస్తోంది. మంత్రికి తెలియకుండా ఉమ్మడి జిల్లాకు చెందిన మంత్రి శ్రీధర్‌బాబు, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి సహకారంతోనే నరేందర్‌రెడ్డి పదవి తెచ్చుకున్నాడనే కారణంగానే ఆయనను పక్కనబెడుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. సుడా చైర్మన్‌గా నియామకమైన తరువాత నరేందర్‌రెడ్డి మంత్రిని మర్యాదపూర్వకంగా కలిసేందుకు వెళ్లిన సమయంలో కూడా కనీసం కూర్చోమనకుండా, మాట్లాడకుండా అవమానపరిచాడని ఆయన అనుచ రులు రుసరుసలాడుతున్నారు. అప్పటి నుంచి మంత్రికి దూరదూరంగానే ఉంటున్న నరేందర్‌రెడ్డి కరీంనగర్‌లో దీక్షకు హాజరుకాగా ఈ ఘటన చోటు చేసుకోవటంతో ఇప్పటి వరకు పార్టీలోలోపల ఉన్న గ్రూపుల వివాదం బయట సామాజిక మాద్యమాలకు పొక్కింది. నరేందర్‌రెడ్డికి అవమానం జరిగిందంటూ అబ్దుల్ రహమాన్ ఆడియోపై నరేందర్‌రెడ్డి సామా జికవర్గంలో కూడా తీవ్ర చర్చకు దారితీసింది. ఈ చర్యతో రాబోవు పార్లమెంట్ ఎన్నికల వేళ ఆ సామాజికవర్గం ప్రభా వాన్ని చూపే అవకాశాలు లేకపోలేదని భావిస్తున్నారు.