Telangana Cabinet Meeting today : నేడు మంత్రిమండలి సమావేశం

రాష్ట్ర మంత్రి మండలి సమావేశం మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో జరగనుంది.
స్వయం సహాయక సంఘాల సదస్సు కూడా
కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం
హైదరాబాద్: రాష్ట్ర మంత్రి మండలి సమావేశం మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో జరగనుంది. లోక్‌సభ ఎన్నికలను కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తుండడంతో.. ఈ ఎన్నికలకు ముందు జరిగే క్యాబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముంది. మహిళలకు వడ్డీ లేని రుణ పథకం పునరుద్ధరణ, స్వయం సహాయక సంఘాల మహిళలకు బీమా కల్పన, తదితర అంశాల ప్రాతిపదికన మంగళవారం సాయంత్రం 4.30 గంటలకు సికింద్రాబాద్‌లోని పరేడ్ మైదానంలో భారీ మహిళా సదస్సును ప్రభుత్వం నిర్వహిస్తోంది. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయాలనే లక్ష్యంతో పునఃప్రారంభిస్తున్న ఈ పథకానికి అవసరమైన నిధుల కేటాయింపుపై మంత్రిమండలిలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని 10 మండలాలకు సాగు, తాగునీరు అందించేందుకు నిర్మించనున్న నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకానికి మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. అలాగే కాళేశ్వరం ఎత్తిపోతల్లోని మేడిగడ్డ(లక్ష్మి) బ్యారేజీ కుంగుబాటు ఘటనపై జ్యుడిషియల్ విచారణ చేయించేందుకు నిర్ణయించిన ప్రభుత్వం.. దీనిపై చర్చించి ఆమోదించనుంది. రైతుభరోసా పథకాన్ని మరింత పకడ్బందీగా అమలు చేయడానికి వీలుగా అవసరమైన మార్పుచేర్పులు చేయడంపైనా చర్చించనున్నట్లు తెలుస్తోంది. పంటల బీమాను వచ్చే వానాకాలం నుంచి అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సైతం మంత్రిమండలి ఆమోదం తెలపనుంది. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీల నియామకాలపై ఇటీవల హైకోర్టు తీర్పు వెలువడిన నేపథ్యంలో.. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన ఆచార్య కోదండరాం, సియాసత్ పత్రిక ఎడిటర్ ఆమిర్ అలీఖాన్‌ల పేర్లను మంత్రివర్గం మరోసారి గవర్నర్ ఆమోదం కోసం పంపించనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో కార్పొరేషన్లు లేని సామాజికవర్గాలు చాలా ఉన్నాయి. కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో పొందుపరిచిన విధంగా ఆయా సామాజికవర్గాలకు కొత్తగా కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.
ఉద్యోగ సంఘాల సమస్యలపైనా..
ప్రభుత్వ ఉద్యోగుల పెండింగ్ డీఏలపై చర్చించి సానుకూల నిర్ణయం తీసుకునే వీలుంది. మంత్రి మండలి సమావేశానికంటే ముందు ఉద్యోగుల సమస్యలకు సంబంధించిన జీవో 317పై మంత్రి మండలి ఉప సంఘం సచివాలయంలో సమావేశం కానుంది. మంత్రి దామోదర్ రాజనర్సింహ ఛైర్మన్‌గా ఉన్న ఈ ఉప సంఘంలో మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్ సభ్యులు. ఇటీవల హైదరాబాద్‌లోని ఎంసీఆర్‌హెచ్‌ఆర్డీఐలో సీఎం రేవంత్‌రెడ్డి పలు ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో భేటీ అయ్యి వారి సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఉప సంఘం సమావేశంలో జీవో 317కు సంబంధించి మంత్రి మండలికి చేయాల్సిన సిఫార్సులపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.