One in every ‘three’ is a tenant farmer! – ప్రతి ‘ముగ్గురి’లో ఒకరు కౌలు రైతే!

తెలంగాణలో జరుగుతున్న రైతు ఆత్మహత్యల్లో అత్యధికులు కౌలుదారులేనని రైతు స్వరాజ్యవేదిక వెల్లడించింది. 2014 నుంచి 2022 వరకు 800 మంది రైతులు బలవన్మరణాలకు పాల్పడితే అందులో 75 నుంచి 80 శాతం మంది కౌలుదారులేనని తన అధ్యయనంలో నిగ్గుతేల్చింది. రాష్ట్రంలో కౌలు రైతుల సమస్యలపై 2022లో చేసిన అధ్యయన నివేదికలోని ముఖ్యాంశాలివీ…
- 2022 మే, జూన్ నెలల్లో 34 గ్రామాల్లోని 7744 మంది రైతులను సర్వేచేస్తే అందులో 2753 (35.6శాతం) మంది కౌలుదారులని తేలింది. ప్రతి ముగ్గురిలో ఒకరు భూమిని కౌలుకు తీసుకొని సాగు చేస్తున్నారు. కౌలు రైతుల్లో 60.9 శాతం మంది బీసీలు, 22.9 శాతం ఎస్సీలు, 9.7 శాతం మంది ఎస్టీలు, 2.4 శాతం ముస్లింలు, 4.2 శాతం మంది ఓసీలు.. కౌలుకు ఇస్తున్న వారిలో 49 శాతం మంది బీసీలు, 33 శాతం మంది ఓసీలు, 10 శాతం మంది ఎస్సీలు, మిగిలిన ఏడు శాతం ఎస్టీ, మైనారిటీ తరగతుల వారు. కౌలు రైతుల్లో 9.5 శాతం మంది మహిళలు కాగా వీరిలో 25 శాతం మంది ఒంటరి మహిళలు.
- కౌలు రైతుల్లో 19 శాతం మందికి కొంచెం కూడా భూమి లేదు. మిగిలిన 81 శాతం మందికి ఎంతో కొంత భూమి ఉంది. ఇందులో 48 శాతం మంది 2.5 ఎకరాలకు తక్కువ భూమి ఉన్నవారున్నారు.
- కౌలు రైతుల్లో 73 శాతం మంది ఒకే భూమిని మూడు లేదా అంతకంటే ఎక్కువ సంవత్సరాలుగా సాగు చేస్తున్నారు. కౌలు రైతుల్లో 97.3 శాతం మందికి రైతుబంధు, ఇతర పథకాలు అందడం లేదు.
- కౌలు రైతుల్లో ప్రతి ఒక్కరికీ సగటున రూ.2.7 లక్షల వరకు రుణం ఉంది. అందులో రూ.2 లక్షలు ప్రైవేటు రుణాలే. ప్రైవేటు అప్పులపై 24 శాతం నుంచి 60 శాతం వరకు వడ్డీ ఉంది. ప్రకృతి వైపరీత్యాలతో వారు తీవ్రంగా నష్టపోతున్నారు.