New ones will not be given.. Names will not be added – కొత్తవి ఇవ్వరు.. పేర్లు చేర్చరు
ఆహార భద్రత కార్డుల్లో కొత్త పేర్లు చేర్చడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. వేలాది మంది లబ్ధిదారులు ఏళ్ల నుంచి ఎదురుచూస్తున్నా ప్రభుత్వం పట్టింపులేనట్లుగా ఉంటోంది. దీంతో వేలాది మందికి ఆహారభద్రత పథకం అందడం లేదు. కామారెడ్డిలో 2.53 లక్షలు, నిజామాబాద్‌లో 4.02 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. ఆయా కుటుంబాల్లో కొత్తగా జన్మించిన వారి పేర్లు కార్డుల్లో చేర్చడానికి స్థానికంగా వీలులేకుండా పోయింది. దరఖాస్తుల వివరాలు రాష్ట్రస్థాయికి పంపించినప్పటికీ పరిష్కారానికి నోచుకోవడం లేదు. దీంతో లబ్ధిదారులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ఇక కొత్త రేషన్‌కార్డులకు దరఖాస్తు చేయడానికి ఉద్దేశించిన సైట్ రెండేళ్ల నుంచి మూసి ఉంది.
పథకాలకు దూరం..
రేషన్‌కార్డులో పేరు నమోదు కాకపోవడంతో లబ్ధిదారులు వివిధ ప్రభుత్వ పథకాలకు దూరమవుతున్నారు. ఇటీవల స్థలం ఉన్న వారికి ప్రభుత్వం గృహలక్ష్మి పథకం తీసుకువచ్చింది. దరఖాస్తులతో పాటు రేషన్‌కార్డులు జత చేయాలని సూచించారు. రేషన్‌కార్డులు లేని వారు దరఖాస్తు చేసుకోవడానికి ఇబ్బందిపడ్డారు. ఆరోగ్యశ్రీ కూడా వర్తించదని బాధితులు పేర్కొంటున్నారు. ఆహారభద్రత కార్డు ప్రకారమే ఆరోగ్యశ్రీ కార్డు జారీ చేస్తున్నారని చెబుతున్నారు. కొత్త వారికి పేరు లేకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆవేదన చెందుతున్నారు. కార్డులో పేరు ఉంటే స్థానికంగా తహసీల్దార్‌తో ధ్రువీకరించుకుని అత్యవసర చికిత్సకు వెళ్లే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. ఇకనైనా రేషన్‌కార్డుల్లో పేర్లను నమోదు చేయించాలని కోరుతున్నారు.
జాప్యంతో ఇబ్బందులు
రేషన్ కార్డుల నుంచి వివాహమైన ఆడపిల్లల పేర్లు తొలగిస్తున్నారు. కాని అదే అమ్మాయి పేరును అత్తారింటి కార్డులో చేర్చడానికి ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. చాలా మంది ఆడపిల్లలు తమ పేరును చేర్చాలంటూ దరఖాస్తులు పెట్టుకున్నారు. ఇలాంటివి కామారెడ్డి జిల్లావ్యాప్తంగా 6,500 వరకు ఉన్నాయి. మరికొన్ని మండలాల్లో వివాహమైన ఆడపిల్లల పేర్లను తల్లిదండ్రుల కార్డులోంచి తొలగించడం లేదు. ఐదారేళ్ల కిందట జన్మించిన పిల్లల పేర్లు కార్డుల్లో లేకపోవడంతో వారికి బియ్యం రావడం లేదు. దీంతో కూలీ చేసి కుటుంబాన్ని పోషించుకునే వారికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
గతంలో వెనువెంటనే..
గతంలో కార్డుల జారీ, కొత్తవారి పేర్లు నమోదు చేసే ప్రక్రియ భిన్నంగా ఉండేది. స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేస్తే చాలు కార్డుల జారీ, పేర్లు చేర్చడం వంటి ప్రక్రియలు వెనువెంటనే జరిగేవి. జిల్లాస్థాయిలో ఈ ప్రక్రియ నిర్వహించడానికి వెసులుబాటు ఉండేది. ఇప్పుడా పరిస్థితి లేదు. కార్డులు జారీ చేయడం, సభ్యులను చేర్చడం, తొలగించడం అంతా రాష్ట్రస్థాయిలో ఉంది.