Thummala Nageswara Rao: జులై నుంచి రైతు భరోసా

శాసనసభ ఎన్నికల సందర్భంగా తాము ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉన్నామని.., వాటిని కచ్చితంగా అమలు చేసి తీరుతామని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.
శాసనసభ ఎన్నికల సందర్భంగా తాము ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉన్నామని.., వాటిని కచ్చితంగా అమలు చేసి తీరుతామని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. వానాకాలం సీజన్ నుంచే పంట సాగు చేసేవారందరికీ ‘రైతు భరోసా’ అమలు చేయనున్నామని, జులైలో ఎకరానికి రూ.7500 చొప్పున పెట్టుబడి సాయం అందుతుందని చెప్పారు. రైతుల నుంచి అఫిడవిట్ తీసుకుంటేనే కౌలుదార్లకు భరోసా సాయం అందిస్తామన్నారు. పంద్రాగస్టులోపు రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేయడం ఖాయమని తెలిపారు. వడ్డీ వ్యాపారులపై ఆధారపడకుండా బ్యాంకుల నుంచి చిన్న, సన్నకారు రైతులందరికీ రుణసహాయం అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులను సకాలంలో అందిస్తామని హామీ ఇచ్చారు. కేంద్రం కొన్నా.. కొనకపోయినా రైతుల పంటలకు గిట్టుబాటు ధర అందేలా చర్యలు చేపడతామన్నారు. పంట నష్టపోయిన సందర్భాల్లో రైతులను ఆదుకునేలా పంటల బీమాకు ప్రభుత్వమే ప్రీమియం చెల్లిస్తుందని.. ఈ వానాకాలం నుంచి అమలు చేస్తుందని పేర్కొన్నారు. శనివారం ఆయన ‘ఈనాడు’కు ఇంటర్వ్యూ ఇచ్చారు.
గత 5 నెలలుగా రైతు సంక్షేమ పథకాల అమలుపైనే దృష్టి సారించామని వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ప్రతీరోజు సమీక్షలు జరిపి ఎప్పటికప్పుడు ఆదేశాలిచ్చామని వెల్లడించారు. మద్దతు ధరతో ధాన్యం, పలు ఉత్పత్తుల కొనుగోళ్లు చేపట్టామని, వర్షాల వల్ల పంటలు నష్టపోయిన వారికి రెండు నెలల్లోపే సాయం అందించామని ‘ఈనాడు’ ఇంటర్వ్యూలో తెలిపారు. వివరాలివీ..
మీరు అధికారంలోకి వచ్చేనాటికి రాష్ట్రంలో వ్యవసాయరంగం ఎలా ఉంది?
మేం వచ్చేనాటికి వానాకాలం పంట ముగిసి యాసంగి మొదలైంది. నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల్లో నీళ్లు లేవు. వర్షాకాలం పంటకు అప్పటి ప్రభుత్వం నీరివ్వలేదు. కొనుగోలుకు సైతం విద్యుత్ అందుబాటులో లేదు. కష్టమైనా సరే.. కరెంట్ కొనుగోలు చేసి పంటలు కాపాడాం. భూగర్భజలాలు అడుగంటిన చోట ఇబ్బంది ఏర్పడింది. అయినా గత యాసంగి కంటే ఈసారి ఎక్కువ పంటలు పండాయి. వానాకాలం పంటకు నీరివ్వకుండా భారాస నేతలు మామీద నెపం మోపారు. భూగర్భ జలాలున్నాయని పంటలు పండుతాయనే ఆశతో రైతులు సాగు చేసినా.. ఈసారి అవి తగ్గిపోయి చివరి భూములకు నీరందలేదు.
రైతుల కోసం భారీ హామీలిచ్చారు.. వాటి అమలు తీరు ఎలా ఉంది?
రైతులను అభివృద్ధి చేయాలనే సంకల్పంతో కాంగ్రెస్ ఎన్నికల ప్రణాళికలో హామీలిచ్చింది. వాటికి భారీగా నిధులు అవసరం. రూ.2 లక్షల రుణమాఫీకే రూ.40 వేల కోట్లకు పైగా కావాలి. ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితి దృష్ట్యా రుణం రాదు. రాష్ట్రానికి ఆదాయం తగ్గింది. వీటిని అధిగమించి రుణమాఫీ చేయాలి. రైతుభరోసా, పంటల బీమా విధివిధానాలపై దృష్టి సారించాం. ధాన్యానికి బోనస్‌ను ప్రకటించాం.
పంద్రాగస్టుకు రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్ హామీ ఇచ్చారు కదా..?
భారాస ప్రభుత్వం రూ.లక్ష మాఫీయే సరిగా చేయలేదు. మేం రూ.2 లక్షల మాఫీ కచ్చితంగా అమలు చేయాలనే సంకల్పంతోనే ఉన్నాం. ఒకే దఫా మొత్తం రుణమాఫీ చేయాలని సీఎం చెప్పారు. నిధుల సమీకరణకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటుపై దృష్టి సారించాం. దీంతోబాటు మార్గదర్శకాలు తయారుచేస్తున్నాం. రాష్ట్రంలో రైతులు తీసుకున్న రూ.2 లక్షలలోపు పంట రుణాలపై వాస్తవ గణాంకాలు ఇవ్వాలని బ్యాంకులను ఆదేశించాం. ఎన్నికల కోడ్ ముగిశాక దీని కటాఫ్‌తేదీపై మంత్రిమండలిలో చర్చించి నిర్ణయం తీసుకుంటాం. దీన్ని ముఖ్యమంత్రి ప్రకటిస్తారు.
రైతుబంధును అయిదెకరాలలోపు వారికి ఇస్తామన్నారు. అందరికీ వేశారు. రైతుభరోసా అందరికీ వర్తింపచేస్తారా..?
సంక్షేమం నిరుపేదకు వెళ్లాలి. చేయూత అర్హులకు అందాలి. గత ప్రభుత్వ హయాంలో రైతుబంధుకు ఆరేళ్లలో రూ.80,450 కోట్లు అందిస్తే.. అందులో పంటలు వేయని వారికి రూ.25 వేల కోట్లు ఇచ్చారు. రైతుభరోసా అయిదెకరాల్లోపు వారికి సాయం అందించాలనే సూచనలు వస్తున్నాయి. రైతుబంధు కొనసాగుతున్న పథకం కాబట్టి దానిని యథాతథంగా అమలు చేద్దామని సీఎం చెప్పారు. రైతుభరోసాలో మార్పులు చేయాలనుకుంటున్నాం. ఎన్ని ఎకరాల వారికి వర్తింపచేయాలనే దానిపై మంత్రిమండలి నిర్ణయిస్తుంది. పరిమితి విధిస్తే భారీగా భూములున్న వారికి సాయం రాదు. నాకు కూడా సాయం అందదు. నేను అందుకు సిద్ధంగానే ఉన్నాను.
పంటల బీమా అమలుకు మార్గదర్శకాలు సిద్ధమయ్యాయా..?
అకాల వర్షాలు, వరదలు, ఇతర ప్రకృతి వైపరీత్యాలతో పాటు తెగుళ్లు, కరవు వల్ల పంటలు నష్టపోయిన వారిని ఆదుకునేలా ఈ పథకం ఉంటుంది. పంట దిగుబడులు తగ్గినా, పంట వేయలేని పరిస్థితులున్నా సాయం అందాలి. ఈపథకానికి రూ.3500 కోట్ల మేర ఖర్చు పెట్టడానికి సిద్ధమయ్యాం. దీనిపై టెండర్ డాక్యుమెంటు తయారవుతోంది. బీమా కంపెనీల కోసం కాకుండా రైతులకు మేలు జరిగేలా విధివిధానాలు ఉంటాయి. గతంలో అప్పు తీసుకున్న వారికే సాయం అందేది. ఇది బీమా కంపెనీలకు లాభం తెచ్చింది. కొత్త పథకం అలా ఉండదు. దీనిపై మేం పెట్టిన షరతులకు అంగీకరించే కంపెనీలనే ఎంపిక చేస్తాం.
వరికి బోనస్ ఇస్తామన్నారు.. కానీ సన్న రకాలకే ప్రకటించి, దొడ్డు వడ్లకు ఎందుకు మినహాయించారు..?
రాష్ట్రంలో భవిష్యత్‌లో సన్నరకం బియ్యం ఉత్పత్తి చేసి.. రేషన్‌షాపుల ద్వారా పేదలకు పంపిణీ చేయాలని సీఎం రేవంత్ ఆలోచిస్తున్నారు. దీనికోసం వాటి ఉత్పత్తిని పెంచాలి. ఇందుకు పెట్టుబడి ఎక్కువవుతుంది. దిగుబడి తక్కువ వస్తుంది. దీంతో రైతులు సాగుకు వెనుకాడుతున్నారు. ఎక్కువ దిగుబడి వస్తుందని దొడ్డు వడ్లనే వేస్తున్నారు. వారిని ప్రోత్సహించేందుకు ప్రాథమికంగా సన్నవడ్లకు బోనస్ ప్రకటించాం. అవసరాన్నిబట్టి దొడ్లు వడ్లకూ వర్తింపజేస్తాం.
వానాకాలం సీజన్ సన్నద్ధత ఎలా ఉంది
రాష్ట్రంలో వ్యవసాయం సుసంపన్నం కావాలి. వానాకాలం సీజన్‌కు కార్యాచరణ సిద్ధం చేశాం. వర్షాలు బాగుంటాయని వాతావరణశాఖ నివేదించింది. నీటి సమస్య ఉండదు. విత్తనాలు, ఎరువులు సరిపడా ఉన్నాయి.
పంటల వైవిధ్యీకరణలో రాష్ట్రం వెనుకంజలో ఉంది కదా..?
రాష్ట్రంలో ఆయిల్‌పామ్, పప్పుదినుసులు, కూరగాయల వంటి ఉద్యాన పంటలకు బాగా డిమాండ్ ఉంది. ఏటా లక్ష ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు పెంచాలని ప్రయత్నిస్తున్నాం. వరికి అనుకూలం కాని భూముల్లో మిగిలిన పంటలు వేయించాలని అధికారులను ఆదేశించాం.
నకిలీ విత్తనాల నియంత్రణ ఎందుకు సాధ్యం కావడం లేదు..?
నకిలీ విత్తనాల వ్యాపారంపై ఉక్కుపాదం మోపుతున్నాం. రోజువారీ దాడులు, తనిఖీలు విస్తృతంగా జరుగుతున్నాయి. నకిలీ విత్తనాలు విక్రయించిన వారి లైసెన్స్‌లు రద్దు చేస్తున్నాం. క్రిమినల్ కేసులు పెట్టి జైలుకు పంపుతున్నాం. పీడీ చట్టం ప్రయోగిస్తున్నాం. ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న నకిలీ విత్తనాలను కట్టడి చేసేందుకు పోలీసు, టాస్క్‌ఫోర్స్ యంత్రాంగం పనిచేస్తున్నాయి. రైతులు అధీకృత డీలర్ల వద్ద విత్తనాలు కొనాలి. వాటి బిల్లు తీసుకోవాలి. అది ఉంటే పంట నష్టపోయిన సందర్భంలో కంపెనీల నుంచి పరిహారం వసూలు చేసేందుకు అవకాశం ఉంటుంది. విత్తనాలకు డిమాండ్‌ను బట్టి వాటిని ఆయా జిల్లాల్లో అందుబాటులో ఉంచాలని ఆదేశించాం. విత్తనాల విక్రయాలపై రోజువారీ నిఘా ప్రారంభించాం. రాష్ట్రవ్యాప్తంగా ప్రతీషాపు నుంచి ఆన్‌లైన్ నివేదికలను హైదరాబాద్‌కు పంపాలని ఆదేశించాం. నకిలీ విత్తనాలను అరికట్టేందుకు లైసెన్సింగ్ విధానంలో మార్పులు చేయనున్నాం.
వానాకాలం సీజన్‌కు రైతు భరోసా ఇస్తారా?
మేం వచ్చేనాటికి రైతుబంధు అమల్లో ఉంది. దానిని కొనసాగించాం. వానాకాలం సీజన్ నుంచి రైతు భరోసా అమలు చేస్తాం. వాస్తవంగా పంట వేసుకున్న వారికే దీనిని ఇస్తాం. జూన్‌లో ఎన్నికల కోడ్ ముగియగానే.. దీనిపై అఖిలపక్షంతో పాటు రైతులు, రైతు సంఘాల అభిప్రాయాలు తీసుకుంటాం. శాసనసభలో, మంత్రిమండలిలో దీనిపై చర్చిస్తాం.
కౌలు రైతులు, రైతు కూలీలకు సాయం చేస్తామని హామీ ఇచ్చారు..?
పంట సాగుచేసిన వారికి రైతుభరోసా అందుతుంది. కౌలుదార్లు సాగు చేస్తే వారికే నిధులిస్తాం. మార్గదర్శకాలు రూపొందిస్తున్నాం. భూములను కౌలుకు తీసుకునే సమయంలో రైతుల నుంచి అఫిడవిట్లు తీసుకున్న కౌలుదార్లకే రైతుభరోసా సొమ్ము ఇస్తాం. రైతు కూలీల గుర్తింపు అంశాన్ని పంచాయతీరాజ్‌కు అప్పగించాం.