Malkajigiri is ours again! మల్కాజిగిరి మళ్లీ మనదే!

‘మల్కాజిగిరి లోక్‌సభ స్థానం నుంచి మనమే గెలుస్తున్నాం.. కాంగ్రెస్ జెండా మళ్లీ ఎగరేద్దాం.. గట్టిగా ప్రచారం నిర్వహిద్దాం.. ఇక్కడ ఎంపీగా విజయం సాధించినందుకే ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగా..’ అని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు.
హైదరాబాద్ – జూబ్లీహిల్స్, న్యూస్‌టుడే: ‘మల్కాజిగిరి లోక్‌సభ స్థానం నుంచి మనమే గెలుస్తున్నాం.. కాంగ్రెస్ జెండా మళ్లీ ఎగరేద్దాం.. గట్టిగా ప్రచారం నిర్వహిద్దాం.. ఇక్కడ ఎంపీగా విజయం సాధించినందుకే ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగా..’ అని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. జూబ్లీహిల్స్‌లోని తన నివాసం వద్ద మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని కాంగ్రెస్ నాయకులు, ముఖ్య కార్యకర్తలతో గురువారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాను ముఖ్యమంత్రిగా ఇప్పుడు ఇక్కడ మాట్లాడగలుగుతున్నానంటే.. ఆ గొప్పతనం మల్కాజిగిరి నాయకులు, కార్యకర్తలదేనని.. భుజాలపై మోసి తనను దిల్లీకి పంపించారని వివరించారు. కేసీఆర్ పతనం 2019 మల్కాజిగిరి పార్లమెంట్ ఎన్నికల నుంచే మొదలైందన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రమంతా కాంగ్రెస్ పార్టీ గెలిచినా మల్కాజిగిరి లోక్‌సభ నియోజకర్గ పరిధిలో ఆశించిన ఫలితాలు రాకపోవడంతో కార్యకర్తల్లో కొంత అసంతృప్తి నెలకొందన్నారు. ఇప్పుడు లోక్‌సభ స్థానంలో కాంగ్రెస్ జెండాను ఎగరేసి అభివృద్ధి చేసుకుందామని పిలుపునిచ్చారు. మల్కాజిగిరి లోక్‌సభతోపాటు కంటోన్మెంట్ శాసనసభ ఉప ఎన్నికలోనూ కాంగ్రెస్ గెలవాలని ఆకాంక్షించారు. హోలీ పండగలోగా అధిష్ఠానం పూర్తిస్థాయిలో అభ్యర్థులను ప్రకటించనుందని.. ఎన్నికల్లో కష్టపడిన వారిని ప్రభుత్వంలో భాగస్వాములను చేసే బాధ్యత తనదని హామీ ఇచ్చారు. మండువేసవిలో సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ కొనసాగుతున్నందున ఉదయం ఏడుగంటలకే ప్రచారం ప్రారంభించాలని.. బస్తీ నాయకులు, కార్యకర్తలు ఓటర్ల వద్దకు వెళ్లాలని సీఎం సూచించారు.
మల్కాజిగిరి లోక్‌సభ పరిధిలోని అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసిన అభ్యర్థులు ప్రతి నియోజకవర్గానికి ఐదుగురు చొప్పున సీనియర్ నాయకులు, కార్యకర్తలతో కమిటీలను ఏర్పాటు చేసుకోవాలని.. వారి ద్వారా పోలింగ్ బూత్‌లవారీగా పనివిభజన చేసుకుని రోజువారీ సమీక్షలు నిర్వహించుకోవాలని సూచించారు. ఇక్కడ ప్రచార సరళి రాష్ట్రవ్యాప్తంగా ఆదర్శంగా నిలవాలన్నారు. కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గ కార్యకర్తల సమావేశం శుక్రవారం నిర్వహించాలని సీఎం ఆదేశించారు. మల్కాజిగిరి పరిధిలోని ప్రధాన ప్రాంతాలకు మెట్రోరైల్, ఎంఎంటీఎస్ రావాలంటే కాంగ్రెస్ గెలవాల్సిన అవసరం ఉందన్నారు. జవహర్‌నగర్ డంపింగ్ యార్డ్ సమస్య కాంగ్రెస్ మాత్రమే తీర్చగలదని.. ఐటీ పరిశ్రమలను మన ప్రభుత్వమే తీసుకువస్తుందంటూ ఓటర్లకు వివరించాలన్నారు. కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతగా వ్యవహరించి స్కైవేల నిర్మాణానికి శంకుస్థాపన చేశామని గుర్తుచేశారు. ఇప్పటికే ఆరు గ్యారంటీల్లోని హామీలను అమలు చేస్తున్నామని.. ఆయా పథకాలు విజయవంతమయ్యాయని వివరించారు. సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, వికారాబాద్ జడ్పీఛైర్‌పర్సన్ సునీతా మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి, ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాస్కీగౌడ్, మేడ్చల్ డీసీసీ అధ్యక్షుడు హరివర్ధన్‌రెడ్డి, సీనియర్ నేతలు మైనంపల్లి హనుమంతరావు, తోటకూర వజ్రేశ్‌యాదవ్ తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.