Loan up to Rs.Crore.. Insurance facility రూ.కోటి వరకు రుణం.. బీమా సౌకర్యం

రాష్ట్రంలోని మహిళా స్వయం సహాయక సంఘాలకు ఊతమిచ్చేందుకు ‘తెలంగాణ మహిళాశక్తి’ పథకానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది.
హైదరాబాద్: రాష్ట్రంలోని మహిళా స్వయం సహాయక సంఘాలకు ఊతమిచ్చేందుకు ‘తెలంగాణ మహిళాశక్తి’ పథకానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. ఈ నెల 12న సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో జరిగే మహిళా సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. ఈ మేరకు స్వయం సహాయక సంఘాలకు వడ్డీలేని రుణాల పథకాన్ని పునఃప్రారంభిస్తారు. 2014 నుంచి అమల్లో ఉన్న ఈ పథకంలో.. మహిళా సంఘాలు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొని సకాలంలో చెల్లిస్తే, వారు చెల్లించిన వడ్డీని రాష్ట్ర ప్రభుత్వం తిరిగి చెల్లిస్తుంది. 2019-20 వరకు ప్రభుత్వం ఈ వడ్డీ రాయితీ ఇచ్చింది. తర్వాత ఈ పథకానికి నిధులు నిలిచిపోయాయి. రూ.3,750 కోట్ల మేర బకాయిలున్నాయి. తాజాగా ప్రభుత్వం ఈ పథకాన్ని సున్నా వడ్డీ రుణాల పథకంగా అమలు చేస్తుంది. గతంలో బకాయి ఉన్న నిధులను చెల్లిస్తుంది. ఇకపై ప్రతి 6 నెలలకోసారి క్రమం తప్పకుండా వడ్డీని మహిళా సంఘాలకు రీఎంబర్స్‌మెంట్ చేస్తుంది. బ్యాంకు లింకేజీ రుణాలను పొందడంలో తెలంగాణలోని స్వయం సహాయక సంఘాలు దేశంలోనే రెండో స్థానంలో ఉన్నాయి. వాటిని మరింతగా ప్రోత్సహిస్తారు. దీంతోపాటు మహిళా సంఘాలకు మరికొన్ని పథకాలను ప్రభుత్వం అమలు చేయనుంది.
- స్వయం సహాయక సంఘాల్లోని సభ్యులెవరైనా ప్రమాదవశాత్తూ లేదా సహజంగా మరణిస్తే గ్రూప్ నుంచి తీసుకున్న రుణం మాఫీ చేస్తారు. వారి కోసం ప్రత్యేక రుణ బీమా పథకం అమలు చేస్తారు. స్వయం సహాయక సంఘాల్లోని దాదాపు 63.86 లక్షల మంది మహిళలకు రూ.5 లక్షల జీవిత బీమా సౌకర్యం కల్పిస్తారు.
- ఒక్కో గ్రామ సమాఖ్య పరిధిలోని సంఘాలకు రూ.కోటి వరకు రుణం ఇస్తారు. మొదటి ఏడాది రాష్ట్రంలోని 5 వేల గ్రామాలకు రూ.5 వేల కోట్ల రుణాలను మంజూరు చేస్తారు. మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తల కోసం ప్రతి శాసనసభ నియోజకవర్గానికో ప్రత్యేక చిన్నతరహా పారిశ్రామిక పార్కును ఏర్పాటు చేస్తారు.
- మహిళలకు ఆసక్తి ఉన్న రంగాల్లో నైపుణ్య శిక్షణ ఇప్పిస్తారు. సంఘాల మహిళలందరికీ ఉపాధి కల్పించడంతో పాటు ఆర్థికంగా బలోపేతం అయ్యే కార్యక్రమాలకు ప్రాధాన్యమిస్తారు. విద్యార్థులు, పోలీసు, అగ్నిమాపక, వైద్య ఆరోగ్య సిబ్బంది తదితరులు వాడే ఏకరూప దుస్తుల (యూనిఫామ్‌ల)ను కుట్టించే పనులను అప్పగిస్తారు. మండలాలు, జిల్లాకేంద్రాల్లో మహిళలకు కుట్టుమిషన్లపై శిక్షణ ఇచ్చి.. ఉపాధికి తోడ్పాటు అందిస్తారు. సాధ్యమైన ప్రాంతాల్లో మినీ సోలార్ యూనిట్లు; కలెక్టరేట్లు, ఇతర ప్రభుత్వ కార్యాలయాల్లో జరిగే కార్యక్రమాలకు ఆహార పంపిణీ ఆర్డర్లను స్వయం సహాయక సంఘాలకు ఇస్తారు. గోల్కొండ, లేపాక్షి తరహాలో స్వయం సహాయక సంఘాలు తయారుచేసే ఉత్పత్తులకు ప్రత్యేక బ్రాండింగ్ కల్పిస్తారు.