KTR: కాంగ్రెస్ 30 వేల ఉద్యోగాలివ్వడం పచ్చి అబద్ధం

దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేనివిధంగా అటెండర్ నుంచి గ్రూప్-1 వరకు స్థానికులకు 95 శాతం రిజర్వేషన్లు తీసుకొచ్చిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిదేనని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. శనివారం తెలంగాణ భవన్‌లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఈనాడు, హైదరాబాద్: దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేనివిధంగా అటెండర్ నుంచి గ్రూప్-1 వరకు స్థానికులకు 95 శాతం రిజర్వేషన్లు తీసుకొచ్చిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిదేనని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. శనివారం తెలంగాణ భవన్‌లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ ప్రభుత్వం 24,086 ఉద్యోగాలు కల్పిస్తే భారాస తొమ్మిదిన్నరేళ్ల పాలనలో 2.32 లక్షల కొలువులకు అనుమతులిచ్చాం. వాటిల్లో 1.60 లక్షలు భర్తీ చేశాం. మరో 30 వేల నియామకాలు వివిధ దశల్లో ఉండగా ఎన్నికల కోడ్ రావడంతో నిలిచిపోయాయి. ఎన్నికలు కాగానే వాటికి నియామకపత్రాలు పంపిణీ చేసి తామే భర్తీ చేశామంటూ సీఎం రేవంత్‌రెడ్డి పచ్చి అబద్ధాలు చెబుతున్నారు. టీఎస్ బీపాస్ ద్వారా 24 వేల పరిశ్రమలకు అనుమతులిచ్చాం. రూ.4 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చాం. ప్రస్తుతం రాష్ట్రం నుంచి పరిశ్రమలు తరలిపోతున్నాయి. కేన్స్, కార్నింగ్ సంస్థలు వెళ్లిపోయాయి. వరంగల్ నుంచి టెక్ మహీంద్రా కూడా తరలిపోయే పరిస్థితి వచ్చింది. రాష్ట్రంలో రేవంత్, భట్టి, ఉత్తమ్ ట్యాక్స్‌లు వసూలు చేస్తున్నారు. పదేళ్లు అధికారంలో లేకపోవటంతో ప్రస్తుతం ఎవరికి వారు అందినకాడికి దోపిడీ చేస్తున్నారు. త్వరలో మంత్రి జూపల్లి కూడా మరో దుకాణం తెరవబోతున్నారు. కొండను తవ్వి ఎలుకను పట్టినట్లుగా ఉంది మేడిగడ్డ పరిస్థితి. కాఫర్‌డ్యామ్ కట్టాలని కేసీఆర్ చెప్పిందే ఇప్పుడు చేస్తామంటున్నారు. మండలి ఉపఎన్నికలో ఓటర్లు రాకేశ్‌రెడ్డిని గెలిపించాలి’ అని కోరారు.