ED : There is no violation of rules in Kavitha’s arrest కవిత అరెస్ట్‌లో నిబంధనల ఉల్లంఘన లేదు

దిల్లీ మద్యం కేసులో తనను అరెస్ట్ చేసే విషయంలో పీఎంఎల్‌ఏ చట్టంలోని సెక్షన్-19 కింద ఉన్న నిబంధనలను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) పాటించలేదన్న ఎమ్మెల్సీ కవిత వాదనలను రౌజ్ అవెన్యూ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ఎంకే నాగ్‌పాల్ కొట్టేశారు.
దిల్లీ మద్యం కేసులో తనను అరెస్ట్ చేసే విషయంలో పీఎంఎల్‌ఏ చట్టంలోని సెక్షన్-19 కింద ఉన్న నిబంధనలను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) పాటించలేదన్న ఎమ్మెల్సీ కవిత వాదనలను రౌజ్ అవెన్యూ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ఎంకే నాగ్‌పాల్ కొట్టేశారు. ఆమె అరెస్ట్ విషయంలో ఈడీ నిబంధనల ప్రకారమే నడుచుకొందని స్పష్టంచేశారు. ఈ నెల 15న హైదరాబాద్‌లో ఆమెను ఈడీ అరెస్ట్ చేసింది. 16న కోర్టులో హాజరు పరిచి.. కస్టడీ కోరుతూ పిటిషన్ దాఖలు చేసింది. ఆ పిటిషన్‌పై న్యాయమూర్తి వెలువరించిన తీర్పు కాపీ తాజాగా బయటికొచ్చింది. ‘‘దిల్లీలోని ప్రజాప్రతినిధులు, ప్రభుత్వోద్యోగులకు రూ.100 కోట్ల లంచాలు ఇచ్చిన సౌత్ గ్రూప్‌లో నిందితురాలు భాగస్వామిగా ఉన్నట్లు, దిల్లీ ఎక్సైజ్ విధానాన్ని తమకు అనుకూలంగా మలుచుకోవడానికి తొలి నుంచీ నేరపూరిత కుట్రలో పాలుపంచుకున్నట్లు ఆరోపణలున్నాయి.
ఈ కేసులో సహ నిందితులుగా ఉండి.. తర్వాత అప్రూవర్‌లుగా మారిన పి.శరత్‌చంద్రారెడ్డి, మాగుంట రాఘవ్, దినేశ్ అరోడా, ఇతర సహ నిందితులు సమీర్ మహేంద్రు, గోరంట్ల బుచ్చిబాబు, సాక్షి మాగుంట శ్రీనివాసులురెడ్డి, వి.శ్రీనివాసరావు, గోపీ కుమరన్‌లు ఇచ్చిన వాంగ్మూలాలు నిందితురాలి పాత్రకు అద్దంపడుతున్నాయి. కవితతో సమావేశమైన తర్వాతే.. మాగుంట శ్రీనివాసులురెడ్డి, అతని కుమారుడు మాగుంట రాఘవ్‌లు ఆమె అనుచరుడైన గోరంట్ల బుచ్చిబాబుకు రెండు విడతల్లో రూ.25 కోట్లు ఇచ్చినట్లు రికార్డుల్లోకి వచ్చింది. ఈ మొత్తంలో సగం తాను చెల్లిస్తానని నిందితురాలు హామీ ఇచ్చారు. ఈ కోణంలో ఇంకా దర్యాప్తు జరగాల్సి ఉంది.
ఇచ్చిన ముడుపులను తిరిగి రాబట్టుకోవడానికి టోకు వ్యాపార సంస్థ ఇండోస్పిరిట్‌లో భాగస్వామిగా చేర్చిన అరుణ్ రామచంద్రన్ పిళ్లై నిందితురాలి ప్రతినిధి/బినామీనే. కొన్ని మొబైల్ ఫోన్లను ఫార్మాట్, ట్యాంపరింగ్ చేసినట్లు ఆమెపై ఆరోపణలున్నాయి. మనీ లాండరింగ్ నేరంలో భాగస్వామి కావడంతోపాటు, కీలకపాత్ర పోషించినట్లు రికార్డులు చెబుతున్నాయి. దర్యాప్తు అధికారి సమర్పించిన కేస్ ఫైల్‌ను పరిశీలిస్తే విచారణకు ఆమె హాజరు కాకపోవడం వల్ల దర్యాప్తు స్తంభించినట్లు కనిపిస్తోంది. నేరపూరిత ఆదాయంలోని ప్రధాన భాగాన్ని వెలికితీయడానికి ఆమెను విచారించాల్సిన అవసరం కనిపిస్తోంది.
పీఎంఎల్‌ఏ చట్టంలోని నిబంధనలను ఉల్లంఘించలేదు
పీఎంఎల్‌ఏ చట్టంలోని సెక్షన్-19 కింద పొందుపరిచిన అన్ని రకాల రక్షణలను అనుసరించే నిందితురాలిని ఈడీ అధికారులు అరెస్ట్ చేయడమే కాకుండా.. అరెస్ట్‌కు కారణాలను ఆమెకు లిఖితపూర్వకంగా ఇచ్చారు. ఇందులో చట్టంలోని నిబంధనల ఉల్లంఘన కనిపించలేదు. ఆమెను 15న సాయంత్రం 5.20 గంటలకు అరెస్ట్ చేసిన తర్వాత చట్టంలోని సెక్షన్-19(3) కింద పేర్కొన్న నిబంధనల ప్రకారం 24 గంటల్లోపు కోర్టు ముందు హాజరుపరిచారు. ఆమెను సూర్యాస్తమయానికి ముందే అరెస్ట్ చేశారు. సీఆర్‌పీసీ సెక్షన్లు 80, 81 ప్రకారం ట్రాన్సిట్ రిమాండ్ లేదని నిందితురాలు చెబుతున్నారు. సెక్షన్-19లోని నిబంధనల ప్రకారం ఆ అవసరం లేదు’’ అని ప్రత్యేక న్యాయమూర్తి ఎంకే నాగ్‌పాల్ తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
పిటిషన్‌పై రేపు విచారణ:
దిల్లీ: దిల్లీ మద్యం కేసులో ఈడీ తనను అరెస్టు చేయడాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో భారాస ఎమ్మెల్సీ కవిత ఈ నెల 18న దాఖలు చేసిన రిట్ పిటిషన్ శుక్రవారం జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎం.ఎం.సుందరేష్, జస్టిస్ బేలా ఎం. త్రివేదిలతో కూడిన ధర్మాసనం ముందు విచారణకు రానుంది. ఈమేరకు సుప్రీంకోర్టు రిజిస్ట్రీ లిస్ట్ చేసింది. కాగా, ఈడీ కస్టడీలో నాలుగో రోజూ కవిత విచారణ కొనసాగింది. కవిత సహాయకులు రాజేశ్, రోహిత్‌రావులను ఈడీ బుధవారం ప్రశ్నించింది. ఆమెను అరెస్టు చేసిన రోజు వీరిద్దరి ఫోన్లను సీజ్ చేసిన ఈడీ.. వాటిని వారి ముందే తెరిచి, వాటిలోని వివరాలపై ప్రశ్నించినట్లు తెలిసింది. ఇద్దర్నీ సాక్షులుగా పరిగణిస్తూ నోటీసులు పంపడంతో విచారణకు హాజరయ్యారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు వీరి విచారణ కొనసాగింది. మరోవైపు, ఈడీ కార్యాలయంలో ఆమెను సోదరుడు కేటీఆర్, న్యాయవాది మోహిత్‌రావు కలిశారు.