Distribution of fortified rice in the joint district – ఉమ్మడి జిల్లాలో పోర్టిఫైడ్ బియ్యం పంపిణీ

మహిళలు, పిల్లలు పోషకాహార లేమితో బాధపడుతున్న విషయాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించాయి. సమస్యను అధిగమించేందుకు పౌరసరఫరా దుకాణాల ద్వారా ఉమ్మడి జిల్లాలో ఈ నెల నుంచి బియ్యంలో పోషకాలు కలిపి(పోర్టిఫికేషన్) సరఫరా చేస్తున్నారు. పోర్టిఫైడ్ బియ్యంతో ప్రయోజనాలు, వండుకోవడం ఎలా అనేదానిపై కథనం.
ఇదీ ప్రక్రియ
ఏ సూక్ష్మ పోషకాలు, విటమిన్లు, ఖనిజాల లేమితో పోషకాహారలోపం తలెత్తుతుందో వాటన్నింటినీ బియ్యంలో చేరుస్తారు. క్వింటాలు సాధారణ బియ్యానికి కిలో చొప్పున పోర్ట్ఫైడ్ రకం కలుపుతారు.
తెలిసేదెలా..?
పోర్టిఫైడ్ ఉత్పత్తులను గుర్తించడానికి ఒక అధికారిక చిహ్నం ఉంది. ప్యాక్ చేసిన సంచుల మీద నీలిరంగులో ప్లస్ గుర్తు, దానిపక్కన ‘ఎఫ్’ అన్న ఆంగ్ల అక్షరం ఉంటాయి. పోర్టిఫికేషన్లో ఏమేమి కలిపిందీ దానిమీద ముద్రించి ఉంటుంది. ఆగస్టు మాసంలో జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో రేషన్ దుకాణాల ద్వారా పోర్టిఫైడ్ బియ్యం పంపిణీ చేశారు.
మామూలుగా వండవచ్చా..?
పోర్టిఫైడ్ బియ్యం గింజలు మామూలు బియ్యంలాగే గట్టిగా ఉంటాయి. బియ్యంలో కలిపేస్తే వాటిని గుర్తుపట్టలేం. ఎప్పట్లాగే బియ్యాన్ని కడిగి వండుకోవచ్చు. ఉడికాక మెతుకుల్లో ఏమీ తేడా తెలియదు. ఈ బియ్యం తయారు చేయడానికి కిలోకు అరవై పైసలు మాత్రమే అదనంగా ఖర్చవుతుంది.
ఫలితాలు ఎలా ఉన్నాయంటే..
దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఇప్పటికే పోర్టిఫైడ్ బియ్యం పంపిణీ జరుగుతోంది. ఈ ప్రాంతాల్లో మంచి ఫలితాలు వచ్చినట్లు నిర్ధారణ అయింది. పిల్లలతో పాటు మహిళలు ఆరోగ్యంగా ఉన్నారని పరిశోధనల్లో తేలింది. ఈ నేపథ్యంలోనే చౌకధరల దుకాణాల ద్వారా పంపిణీని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తప్పనిసరి చేశాయి.
ఈ నెల నుంచి శతశాతం
ఆగస్టులో ఉమ్మడి జిల్లాలో రేషన్ కార్డుదారులకు 40:60 (40 శాతం ఫోర్టిపైడ్, 60 శాతం సాధారణ బియ్యం) నిష్పత్తిలో పంపిణీ చేశారు. ఈ నెల నుంచి శతశాతం పంపిణీ చేస్తున్నారు.