#Telangan Politics #Telangana

Deputy Chief Minister Bhatti : వ్యక్తిగత జీవితాల్లోకి తొంగి చూస్తారా?: ఉప ముఖ్యమంత్రి భట్టి

రంగారెడ్డి జిల్లా: ‘‘తీవ్రవాదుల గుర్తింపు, దేశ భద్రత కోసం ఏర్పాటు చేసి న చట్టాలను నాటి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రాజకీయ అవసరాల కోసం పణంగా పెట్టింది. ఇది ఎంత వరకు కరెక్ట్‌? ప్రతిపక్షాలు, పౌరుల వ్యక్తిగత జీవితాల్లోకి చొరబడ్డారు. భార్యాభర్తలు, వ్యాపారులు, అధికారులు, జడ్జీల ఫోన్లు ట్యాప్‌ చేశారు. ఇంతా చేసి తీరా ఫోన్‌ ట్యాపింగ్‌తో మాకేం సంబంధం అని తప్పించుకుంటారా? వ్యక్తిగత జీవితాల్లోకి తొంగి చూసిన మిమ్మల్ని ఎవరూ క్షమించరు’’అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క బీఆర్‌ఎస్‌ నేతలనుద్దేశించి వ్యాఖ్యానించారు.

‘‘వ్యక్తిగత సమాచారం ట్యాప్‌ చేసి  బ్లాక్‌ మెయిల్‌కు పాల్పడినట్లు ఫిర్యాదులు వస్తున్నాయి. పాలించమని అధికారాన్ని అప్పజెప్పితే ప్రజల ధన, మాన, ప్రాణాలను హరించే విధంగా వ్యవహరిస్తారా? ఇంతకంటే అన్యాయం, ద్రోహం ఇంకేముంది. పదేళ్లు తెలంగాణలో వ్యక్తిగతమైన స్వేచ్ఛ లేకుండా చేశారు. స్వేచ్ఛగా, స్వతంత్రంగా జీవించే హక్కును ఇప్పుడు కాంగ్రెస్‌ ప్రభుత్వం కల్పిస్తోంది.’’అని ఆయన పేర్కొన్నారు. తుక్కుగూడలో కాంగ్రెస్‌ జనజాతర మహా సభ ఏర్పాట్లను గురువారం పరిశీలించిన అనంతరం భట్టి మీడియాతో మాట్లాడారు. 
 
కేసీఆర్‌ ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారు 
’’రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బీఆర్‌ఎస్‌ హయాంలో అతాలాకుతలమైంది. ప్రజలపై భారం మోపే విధంగా యాదాద్రి పవర్‌ ప్లాంట్‌ను ఏర్పాటు చేశారు. జెన్‌కోను, ట్రాన్స్‌కోను సర్వనాశనం చేశారు. ఇప్పుడు వ్యవస్థలన్నింటినీ చక్కబెడుతున్నాం. రెప్పపాటు కూడా కరెంట్‌ పోకుండా చూస్తున్నాం. చేసిందంతా చేసి ప్రస్తుతం అడ్డగోలుగా బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ మాట్లాడుతున్నారు. మూడు నెలలు ఫాంహౌస్‌లో పడుకుని.. తీరా ఎన్నికల ముందు బయటికొచ్చి ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారు. అవాస్తవాలు మాట్లాడే బీఆర్‌ఎస్‌ ప్రతిపక్షంగా కూడా పనికిరాదు’’అని భట్టి ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
తుక్కుగూడలోనే కాంగ్రెస్‌ మేనిఫెస్టో ప్రకటన 
‘దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ ఒక్క కాంగ్రెస్‌తోనే సాధ్యం. తుక్కుగూడ జనగర్జన సభ ఈ దేశానికి దిశా నిర్దేశం చేయనుంది. దేశంలోనే ఈ సభ చారిత్రాత్మకం కానుంది. లోక్‌సభ ఎన్నికల మేనిఫెస్టోను తుక్కుగూడ సభనుంచే ఏఐసీసీ నాయకత్వం ప్రకటించనుంది’’అని ఆయన వివరించారు. భట్టి వెంట మాజీ ఎమ్మెల్యే కేఎల్‌ఆర్, డీసీసీ అధ్యక్షుడు చల్లా నర్సింహ్మా రెడ్డి, మహేశ్వరం సీనియర్‌ నేత దేప భాస్కర్‌రెడ్డి తదితరులు ఉన్నారు.   

Leave a comment

Your email address will not be published. Required fields are marked *