CM REVATH : Hundreds of years of destruction during KCR’s ten-year rule కేసీఆర్ పదేళ్ల పాలనలో వందేళ్ల విధ్వంసం

తెలంగాణలో కేసీఆర్ పదేళ్ల పాలనలో వందేళ్ల విధ్వంసం చేశారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆరోపించారు. రంగారెడ్డి జిల్లాలోని తుక్కుగూడలో ఈ నెల 6న కాంగ్రెస్ నిర్వహించే జనజాతర సభా ప్రాంగణాన్ని సీఎం మంగళవారం పరిశీలించారు.
హైదరాబాద్, మహేశ్వరం – న్యూస్‌టుడే: తెలంగాణలో కేసీఆర్ పదేళ్ల పాలనలో వందేళ్ల విధ్వంసం చేశారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆరోపించారు. రంగారెడ్డి జిల్లాలోని తుక్కుగూడలో ఈ నెల 6న కాంగ్రెస్ నిర్వహించే జనజాతర సభా ప్రాంగణాన్ని సీఎం మంగళవారం పరిశీలించారు. ఆయన వెంట జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి డి.శ్రీధర్‌బాబు, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి, మహేశ్వరం నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌ఛార్జి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు చల్లా నర్సింహారెడ్డి, బడంగ్‌పేట్ మేయర్ పారిజాత నర్సింహారెడ్డి, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి తదితరులున్నారు. ఈ సందర్భంగా సీఎం అక్కడే మీడియాతో మాట్లాడారు. ‘ఈ నెల 6న తుక్కుగూడ సభలోనే జాతీయ ఎన్నికల మ్యానిఫెస్టో విడుదల చేస్తాం. సభకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ వంటి ముఖ్య నేతలంతా వస్తారు. రాష్ట్రం నలుమూలల నుంచి లక్షల మంది ఈ సభకు తరలి రావాలి. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఆరు గ్యారంటీలను ఇదే తుక్కుగూడలో నిర్వహించిన సభలో ప్రకటించాం. వాటిలో ఐదింటిని ఇప్పటికే అమలు చేసి చూపించాం. 200 యూనిట్ల కరెంటు పథకాన్ని ఇప్పటికే 50 లక్షల మంది వినియోగించుకుంటున్నారు. మిగిలిన హామీలను ఎన్నికల కోడ్ ముగిశాక అమలు చేస్తాం. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయం. జూన్ 9న ఎర్రకోటపై జెండాను కాంగ్రెస్ ఎగరేస్తుంది. రాంలీలా మైదానంలో ప్రమాణ స్వీకారానికి అందరూ ఆహ్వానితులే’ అని రేవంత్‌రెడ్డి అన్నారు.
గత ఏడాది వానలు లేకనే కరవు
‘కేసీఆర్ ఇప్పటికైనా పొలంబాట పట్టడం.. పదేళ్ల తర్వాతైనా రైతులు, వ్యవసాయం ఆయనకు గుర్తుకు రావడం సంతోషకరం. కేసీఆర్, ఆయన కుటుంబం చేసిన నిర్వాకాల వల్లే కవిత జైలుకు వెళ్లారు. ఆమె జైలుకు వెళ్లినందుకు సాటి మనుషులుగా మాకు కొంచెం సానుభూతి ఉంది.
అధికారం పోయి.. బిడ్డ జైలుకు వెళ్లాక కేసీఆర్‌కు ప్రజలు గుర్తుకొచ్చారు. వేల పుస్తకాలు చదివిన ఆయనకు వానాకాలం ఎప్పుడొస్తుందో తెలియదా? గత వర్షాకాలంలో అధికారంలో ఉన్నది కేసీఆర్ ప్రభుత్వమే. ఆయన చేసిన పాపాల ఫలితంగానే గత ఏడాది వానలు పడలేదు. అందుకే ఇప్పుడు కరవు వచ్చింది.
64 లక్షల మందికి రైతుబంధు ఇచ్చాం
2018 ఎన్నికలకు ముందు మినహా కేసీఆర్ ప్రభుత్వం ఏ సీజన్‌లోనూ రైతుబంధు నిధుల పంపిణీ 10 రోజుల్లో పూర్తి చేయలేదు. ప్రతి సీజన్‌లోనూ నాలుగైదు నెలల సమయం తీసుకుంది. మా ప్రభుత్వం 64,75,581 మంది రైతుల ఖాతాల్లో రైతుబంధు సొమ్మును ఇప్పటికే జమ చేసింది. ఎన్నికల కోడ్ ముగియగానే మిగిలిన 4 లక్షల ఖాతాలకు జమ చేస్తాం. మేం చెప్పిన లెక్కలు తప్పయితే.. ఏ శిక్షకైనా సిద్ధం. అవి వాస్తవమని నిరూపిస్తే.. రైతులకు కేసీఆర్ క్షమాపణ చెప్పాలి. అసెంబ్లీలోనే రైతుబంధు లెక్కలు బయటపెడదామంటే ఆయన సభకు రాలేదు. ఇటీవల కేసీఆర్ పర్యటించిన రోజున సూర్యాపేటలో 30 సెకన్లు కూడా కరెంటు పోలేదు. ఆయన సూర్యాపేటలో విలేకరులతో మాట్లాడుతున్నప్పుడు మైక్ జనరేటర్‌కు కనెక్ట్ అయి ఉంది. మీ జనరేటర్‌లో ఎవరు పుల్ల పెట్టారో ఎవరికి తెలుసు? భారాస పార్టీ ఖాతాలో రూ.1500 కోట్లు ఉన్నాయి. ఆ సొమ్ము నుంచి రూ.100 కోట్లు రైతులకు ఇచ్చి ఉంటే కేసీఆర్ చేసిన పాపం కొంతయినా తగ్గేది. పార్లమెంటు ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే ఆయన వేషాలు వేస్తున్నారు. చిత్తశుద్ధి ఉంటే.. ప్రతి వారం ప్రజల్లోకి వెళ్లాలి. ప్రతిపక్ష నాయకుడిగా తన బాధ్యత నెరవేర్చాలి.
రైతు ఆత్మహత్యల వివరాలివ్వగలరా?
రేవంత్‌రెడ్డి ఎక్కడ నిద్రపోతున్నారని కేసీఆర్ అంటున్నారు. నేను ఫాంహౌస్‌లోనో.. సినిమా వాళ్ల గెస్ట్‌హౌసుల్లోనో పడుకోవడంలేదని కేసీఆర్ గ్రహించాలి. కేసీఆర్, కేటీఆర్‌లు వాళ్ల బాస్ మోదీ గెలవాలని.. కాంగ్రెస్‌కు దేశంలో 40 సీట్లే రావాలని కోరుకుంటున్నారు. కేసీఆర్‌కు 48 గంటల సమయం ఇస్తున్నా… కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక 200 మంది రైతులు చనిపోయారని ఆరోపిస్తున్న మీరు ఆ వివరాలు ప్రభుత్వానికి ఇవ్వగలరా? నిజంగా రైతులు చనిపోయి ఉంటే వారిని ఆదుకునే బాధ్యత మాది.
మేడిగడ్డ నీరు వదిలింది భారాస హయాంలోనే..
కాళేశ్వరం ప్రాజెక్టుకు వెన్నెముక లాంటి మేడిగడ్డ పిల్లర్లు కుంగిపోయాయి. భారాస అధికారంలో ఉన్నప్పుడే మేడిగడ్డ నుంచి నీరు వదిలేశారు. అది మరిచి ఇప్పుడు కేసీఆర్ మాపై నెపం నెడుతున్నారు. అన్నారం కట్ట పాడైందని.. దాని నుంచి నీరు బయటికి వదిలాం. డ్యాం సేఫ్టీ అధికారులే నీరు నిల్వ చేయవద్దని చెబుతున్నారు. మిషన్ భగీరథ ద్వారా కృష్ణా జలాలను ఇవ్వాల్సినదానికన్నా ఎక్కువగా ఇచ్చాం. వెయ్యి ట్యాంకర్లతో తాగునీటిని సరఫరా చేయిస్తున్నాం. సాగర్‌లో నీటిమట్టాలు డెడ్‌స్టోరేజీకి పడిపోయాయి. తాగునీటికే మొదటి ప్రాధాన్యం. బోర్లు ఎండిపోయినందున ఇంటి అవసరాలకు ట్యాంకర్ల ద్వారా కూడా నీరందిస్తున్నాం. రైతుల బోర్లను తీసుకుని ఊర్లలో ప్రజలకు తాగునీరు సరఫరా చేస్తున్నాం.
మీ తప్పుల్ని సరిచేయడానికి కష్టపడుతున్నాం
రూ. 7 లక్షల కోట్ల అప్పులు చేసి రాష్ట్రాన్ని మాకు అప్పజెప్పారు. మీరు చేసిన తప్పుల్ని సరిదిద్దడానికి మేం రోజుకు 18 గంటలు కష్టపడుతున్నాం. మేం ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరిస్తుంటే.. ఈ ప్రభుత్వం కూలాలి, పోవాలంటూ శాపనార్థాలు పెట్టడమేంటి కేసీఆర్? వరికోతలు ఇంకా పూర్తిస్థాయిలో మొదలే కాలేదు. క్వింటా ధాన్యానికి 10 కిలోల కమీషన్ కొట్టే విధానం మాకు లేదు. దిల్లీ వెళ్లిన ప్రతిసారీ కేంద్రం నుంచి పెండింగు ప్రాజెక్టులు సాధించుకొచ్చాం. ఈ ఎన్నికల్లో భారాస ఎంపీ అభ్యర్థులు పారిపోతుంటే వారిని ఆపడానికి కేసీఆర్ టక్కు టమార విద్యలన్నీ ప్రదర్శిస్తున్నారు. భారాసకు ఓటేస్తే మోదీకి ఓటేసినట్టే అవుతుంది’ అని రేవంత్ దుయ్యబట్టారు.