CM Revanth: Arrangements for a huge public meeting in Telangana : తెలంగాణలో భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు..

దేశ ముఖచిత్రాన్ని మార్చివేసే కీలకమైన లోక్‌సభ ఎన్నికలకు తెలంగాణ గడ్డ మీద నుంచే జంగ్ సైరన్ ఊదాలని కాంగ్రెస్ నిర్ణయించింది. పదేళ్ల పాటు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్.. నరేంద్ర మోదీ నేతృత్వంలోని పదేళ్ల ఎన్డీఏ నిరంకుశ, దుష్పపరిపాలనకు చరమగీతం పాడాలనే కృతనిశ్చయంతో ఉంది.
దేశ ముఖచిత్రాన్ని మార్చివేసే కీలకమైన లోక్‌సభ ఎన్నికలకు తెలంగాణ గడ్డ మీద నుంచే జంగ్ సైరన్ ఊదాలని కాంగ్రెస్ నిర్ణయించింది. పదేళ్ల పాటు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్.. నరేంద్ర మోదీ నేతృత్వంలోని పదేళ్ల ఎన్డీఏ పాలనకు చరమగీతం పాడాలనే కృతనిశ్చయంతో ఉంది. ఈ క్రమంలోనే లోక్‌సభ ఎన్నికలకు సంబంధించిన మేనిఫెస్టోను తెలంగాణ గడ్డమీద, అదీ శాసనసభ ఎన్నికలకు సమరశంఖం పూరించిన తుక్కుగూడ వేదికగానే విడుదల చేయాలని నిర్ణయించింది. ఈ నెల 6వ తేదీన తుక్కుగూడలో ‘జనజాతర’ పేరిట నిర్వహించే భారీ బహిరంగ సభలో మేనిఫెస్టోతో పాటు తాము అధికారంలోకి వస్తే అమలు చేయనున్న అయిదు గ్యారంటీలను కాంగ్రెస్ అగ్ర నాయకత్వం ప్రకటించనుంది.

భారీ బహిరంగ సభ..
తుక్కుగూడలోని 60 ఎకరాల విశాలమైన మైదానంలో జన జాతర బహిరంగ సభను కాంగ్రెస్ నిర్వహించనుంది. మైదానం పక్కనే వాహనాల పార్కింగ్‌కు సుమారు 300 ఎకరాల స్థలం అందుబాటులో ఉంది. రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో పాలనసాగిస్తున్నారు. ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన గ్యారంటీల్లో భాగంగా ఇప్పటికే కొన్ని పథకాలను కాంగ్రెస్ అమలు చేస్తోంది. అన్ని వర్గాలకు సంక్షేమం అందజేస్తూ ముందుకు సాగుతున్నట్లు చెబుతోంది ప్రభుత్వం. ఈ నేపథ్యంలో జనజాతర సభకు ఆదిలాబాద్ మొదలు ఆలంపూర్ వరకు, జహీరాబాద్ నుంచి భద్రాచలం వరకు అన్నిగ్రామాలు, పట్టణాలు, నగరాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు పార్టీ నేతలు. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇప్పటికే తుక్కుగూడ జన జాతర సభ ప్రాంగణాన్నిసందర్శించి సభ ఏర్పాట్లను పర్యవేక్షించారు.

తుక్కుగూడనే ఎందుకు…?
శాసనసభ ఎన్నికలకు తుక్కుగూడ నుంచే ఏ.రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ కాంగ్రెస్ కమిటీ సమరశంఖం పూరించింది. తెలంగాణ విలీన దినోత్సవాన్ని పురస్కరించుకొని సెప్టెంబరు 17న తుక్కుగూడలో విజయభేరి పేరిట భారీ బహిరంగ సభ నిర్వహించింది. విజయభేరి వేదిక మీద నుంచే సోనియగాంధీ ఆరు గ్యారెంటీలను ప్రకటించారు. ఆమె ప్రకటించిన ఆరు గ్యారెంటీలు తెలంగాణ ప్రజల విశ్వాసాన్ని చూరగొనడంతో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ శాసనసభ ఎన్నికల్లో ఘనవిజయం సాధించింది. రాష్ట్రంలో ఏ.రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం కొలువుదీరిందని సెంటిమెంట్ గా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో తమకు కలిసివచ్చిన తుక్కుగూడ నుంచే లోక్‌సభ ఎన్నికలకు సమరశంఖం పూరించాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించినట్లు సమాచారం.

నాటి మాటలే పునరావృతమవుతాయా…?
తుక్కుగూడ వేదికగా నిర్వహించిన విజయభేరి సభలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నాడు రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని, డిసెంబరు 9వ తేదీన కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరుతుందని కుండబద్దలు కొట్టి చెప్పారు. కాంగ్రెస్ ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారానికి ప్రజలంతా ఆహ్వానితులేనని ప్రకటించారు. అవే మాటలను ఆయన ఎన్నికల ప్రచారంలో పదే పదే పునరుద్ఘాటించారు. రేవంత్ రెడ్డి చెప్పినట్లే రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. డిసెంబరు 9కి రెండు రోజులు ముందే ఏడో తేదీన రేవంత్ రెడ్డి సర్కార్ కొలువుదీరింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి తుక్కుగూడ వేదికగానే.. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని, ఢిల్లీ రాంలీలా మైదాన్‌లో జూన్ 9 న ఎర్రకోటపై జెండా ఎగురవేస్తామని ప్రకటించనున్నట్లు సమాచారం. శాసనసభ ఎన్నికలకు ముందు రేవంత్ రెడ్డి చెప్పిన ప్రతి మాట ప్రజల్లో బలమైన ముద్ర వేయడంతో పాటు నిజమవడంతో ఇప్పుడు ఆయన చేసే ప్రకటనలపై ప్రజల్లో, రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.