Bhatti Vikramarka responded to the Yadadri controversy..యాదాద్రి వివాదంపై స్పందించిన భట్టి విక్రమార్క..

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాదాద్రి పర్యటన వివాదానికి కేంద్ర బిందువుగా మారింది. యాదాద్రి ఆలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా మిగిలిన మంత్రులు ఎత్తయిన పీటలపై కూర్చోగా.. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రి కొండా సురేఖలు తక్కువ ఎత్తున్న పీటలపై కూర్చోన్నారు. తాజాగా ఈ వివాదంపై డిప్యూటీ సీఎం భట్టీ విక్రమార్క స్పందించారు.
యాదగిరిగుట్టలో కింద కూర్చున్నారంటూ జరిగిన ట్రోల్ అంశంపై తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క స్పందించారు. తాను కావాలనే చిన్న స్టూల్ మీద కూర్చున్నాను అని భట్టి తేల్చి చెప్పారు. ఆ ఫోటోను తీసుకొని కావాలని కొందరు ట్రోల్ చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఉప ముఖ్యమంత్రిగా, ఆర్థికశాఖామంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తూ రాష్ట్ర ప్రభుత్వాన్ని శాసిస్తున్నానన్నారు భట్టీ విక్రమార్క. ఎవరికీ తలవంచే వాడిని కాదని… ఎవరో పక్కన కూర్చోబెడితే కూర్చునే వాడిని అసలికే కాదన్నారు. ఆత్మ గౌరవాన్ని చంపుకునే మనస్తత్వం తనది కాదంటూ యాదాద్రి వివాదానికి ఫుల్‌స్టాప్ పెట్టేశారు భట్టీ.
యాదాద్రి దేవాలయంలో పూజల సందర్భంగా భట్టీ చిన్న పీటపై కూర్చోవడం విమర్శలకు దారి తీసింది. సీఎం దంపతులు, పలువురు మంత్రులు ఎత్తున్న సీట్లపై కూర్చోవడం… భట్టీ మాత్రం కాస్త ఎత్తు తక్కువ పీటపై కూర్చోవడంతో తీవ్ర దుమారం రేగింది. యాదాద్రీశుడి సాక్షిగా దళిత డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు ఘోర అవమానం జరిగిందని బీఆర్ఎస్, బీఎస్పీ విమర్శించాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాదాద్రి పర్యటనలో దళితుడు అనే కారణంతో భట్టిని కింద కూర్చోబెట్టారని పెద్ద ఎత్తున కాంగ్రెస్ నాయకులపై విమర్శలు చేశారు. దీనిపై సోషల్ మీడియాలో తీవ్రంగా ట్రోల్ జరగడంతో… భట్టీ విక్రమార్క క్లారిటీ ఇచ్చారు. తనకు ఎలాంటి అవమానం జరగలేదని, కావాలనే తాను చిన్న పీటపై కూర్చున్నానని వివరణ ఇచ్చారు.