మేడారం జాతరకు రికార్డ్ స్థాయిలో హుండీ ఆదాయం.. ఎన్ని కోట్లంటే!

మేడారం మహాజాతర హుండీ లెక్కింపు ప్రక్రియ పూర్తయింది. మేడారం జాతర ఆదాయం రూ.13,25,22,511 వచ్చింది. గతంలో కన్నా ఈసారి ఆదాయం పెరిగింది. వచ్చిన ఆదాయాన్ని డిపార్ట్మెంట్బ్యాంక్ అకౌంట్లో జమ చేస్తారు. జాతర అనంతరం హుండీలను టీటీడీ కళ్యాణ మండపానికి తీసుకువచ్చి ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కట్టుదిట్టమైన భద్రత మధ్య లెక్కించారు. నాలుగురోజుల పాటు వైభవంగా సాగిన మేడారం జాతరకు పెద్దఎత్తున భక్తులు తరలివచ్చిన విషయం తెలిసిందే.
ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన మేడారం జాతర కన్నుల పండువగా సాగి అత్యంత వైభవంగా ముగిసింది. అయితే మేడారం సమ్మక్క సారలమ్మ వనదేవతల మహాజాతరలో భక్తులు సమర్పించిన కానుకల లెక్కింపు ప్రక్రియ బుధవారం పూర్తయింది. జాతరలో ఏర్పాటు చేసిన 540 హుండీలను హనుమకొండలోని టీటీడీ కళ్యాణ మండపానికి తరలించి అందులో భక్తులు వేసిన కానుకలను ఆరు రోజులుగా లెక్కించారు. లెక్కింపు ప్రక్రియలో మొత్తం 350 మందికి పైగా సిబ్బంది, మహిళా వాలంటీర్లు పాల్గొన్నారు.
మేడారం జాతరలో మొత్తం రూ.13,25,22,511 ఆదాయం సమకూరినట్లు మేడారం కార్యనిర్వాహక అధికారి రాజేంద్రం తెలియజేశారు. అలాగే అదనంగా 779.800 గ్రాముల బంగారంతో పాటు, 55.150 కిలో గ్రాముల వెండి ఆభరణాలు సైతం వచ్చాయి. వివిధ దేశాల కరెన్సీ నోట్లు, ఒడి బియ్యం, ఇతర కానుకలను భక్తులు పెద్ద మొత్తంలో సమర్పించారు. రెండేళ్ల కిందట జరిగిన మహా జాతరకు రూ.11,45,34,526 ఆదాయం రాగా.. గతంతో పోలిస్తే ఈసారి రూ.1,79,87,985 ఆదాయం పెరిగింది