అన్నదాతలకు అండగా ప్రభుత్వం

రాష్ట్రంలో కరవు వచ్చినా.. ఎంత కష్టం వచ్చినా ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తెలిపారు.
హైదరాబాద్: రాష్ట్రంలో కరవు వచ్చినా.. ఎంత కష్టం వచ్చినా ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 110 రైతు వేదికల్లో ‘రైతునేస్తం’ పేరిట వీడియో కాన్ఫరెన్సింగ్ సేవలను సీఎం బుధవారం ఉదయం తన నివాసం నుంచి వర్చువల్గా ప్రారంభించారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, వ్యవసాయ, ఆబ్కారీ శాఖల మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు తదితరులు సచివాలయం నుంచి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. ప్రస్తుతం కరవు పరిస్థితులున్నాయని, వాటిని కలిసికట్టుగా ఎదుర్కొందామన్నారు. ఏడాదిగా సరైన వర్షపాతం లేకపోవడంతో రిజర్వాయర్లలో నీళ్లు అడుగంటుతున్నాయని, వచ్చే ఎండాకాలంలో తాగునీటి కష్టాలు రాకుండా చూడాలని, అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. రైతులు పరిస్థితిని అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు
‘రైతుల సమస్యలపై ఎప్పటికప్పుడు వారికి అవసరమైన సలహాలు, సూచనలు చేసేందుకు ‘రైతునేస్తం’ ఉపయోగపడుతుంది. రైతుల వద్దకే ప్రభుత్వం వెళ్లాలనే ఆలోచనతో దీనిని చేపట్టాం. ఇకపై వారు నేరుగా వ్యవసాయ నిపుణులతో మాట్లాడవచ్చు. రైతునేస్తం కార్యక్రమాన్ని భవిష్యత్తులో అన్ని రైతు వేదికలకూ విస్తరిస్తాం. ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వరరావులు చేసిన సూచనలతో ప్రభుత్వం ఇటీవలే పంటల బీమా పథకాన్ని అమల్లోకి తెచ్చింది. సాగుకు పెట్టుబడి పెట్టినప్పటి నుంచి.. కరవొచ్చినా, వరదలొచ్చినా నష్టపరిహారం అందుతుంది’’ అని ముఖ్యమంత్రి తెలిపారు. మంత్రి తుమ్మల మాట్లాడుతూ ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం సహకారంతో రాష్ట్ర వ్యవసాయశాఖ రూ.97 కోట్లతో ఈ కార్యక్రమం చేపట్టిందని తెలిపారు. రైతులు సాంకేతికతను అందిపుచ్చుకునేలా ప్రోత్సహిస్తామన్నారు.