అడిగిన సమాచారం ఉందా.. లేదా?

మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు సంబంధించిన పూర్తి సమాచారం అందజేయాలని నేషనల్ డ్యాం సేఫ్టీ అథార్టీ(ఎన్‌డీఎస్‌ఏ) నిపుణుల కమిటీ ఇంజినీర్లను కోరింది.
హైదరాబాద్: మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు సంబంధించిన పూర్తి సమాచారం అందజేయాలని నేషనల్ డ్యాం సేఫ్టీ అథార్టీ(ఎన్‌డీఎస్‌ఏ) నిపుణుల కమిటీ ఇంజినీర్లను కోరింది. ‘సమాచారం ఉంటే ఇవ్వండి, లేదంటే లేదని చెప్పండి. అరకొరగా ఉంటే అదైనా ఇవ్వండి. సమాచారం ఇచ్చినా.. లేదని చెప్పినా అధికారికంగా ఉండాలి. బాధ్యులు సంతకం చేసి ఆ విషయం తెలియజేయాలి’ అని నిపుణుల కమిటీ ఛైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ సంబంధిత ఇంజినీర్లకు స్పష్టం చేశారు. నిపుణుల కమిటీ అడిగిన సమాచారం అంతా ఇవ్వాలని, ఏదైనా దాస్తే చర్యలు తప్పవని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కార్యదర్శి రాహుల్ బొజ్జా ఇంజినీర్లను హెచ్చరించారు. కుంగిన మేడిగడ్డ బ్యారేజీతోపాటు సీపేజీ సమస్యను ఎదుర్కొంటున్న అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను పరిశీలించి అవసరమైన చర్యలు సిఫార్సు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు ఎన్‌డీఎస్‌ఏ.. నిపుణుల కమిటీని నియమించింది. కేంద్ర జల సంఘం మాజీ ఛైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ ఛైర్మన్‌గా, మరో ఐదుగురు నిపుణులు సభ్యులుగా గల ఈ కమిటీ బుధవారం హైదరాబాద్ జలసౌధలో నీటిపారుదల శాఖ అధికారులు, ఇంజినీర్లతో సమావేశమైంది. మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కార్యదర్శి రాహుల్ బొజ్జా, ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవన్‌పాటిల్, ఇంజినీర్ ఇన్ చీఫ్‌లు అనిల్‌కుమార్, నాగేందర్‌రావు, కాళేశ్వరం ప్రాజెక్టు మొదటి లింకు చీఫ్ ఇంజినీర్ సుధాకర్‌రెడ్డి, వివిధ విభాగాలకు చెందిన ఇంజినీర్లు పాల్గొన్నారు.
వీలైనంత త్వరగా ప్రాథమిక నివేదిక ఇవ్వండి: మంత్రి ఉత్తమ్
నిపుణుల కమిటీకి మంత్రి ఉత్తమ్ స్వాగతం పలికారు. పూర్తి సహకారం అందిస్తామని, వీలైనంత త్వరగా ప్రాథమిక నివేదిక ఇచ్చి చేపట్టాల్సిన పనులను సూచించాలని కోరారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకం గురించి సంబంధిత ఇంజినీర్లు ప్రజంటేషన్ ఇచ్చారు. చంద్రశేఖర్ అయ్యర్ మాట్లాడుతూ అడిగిన సమాచారాన్ని దాచకుండా పూర్తిగా ఇవ్వాలని కోరారు. ‘‘ప్రారంభం నుంచి ఇప్పటి వరకు ఇన్వెస్టిగేషన్, డ్రాయింగులు, డిజైన్లు, క్వాలిటీ కంట్రోలు నివేదికలు, ఉన్నత స్థాయి ఇంజినీర్లు, అధికారులు పరిశీలనకు వెళ్లినపుడు ఇచ్చిన ఆదేశాలకు సంబంధించిన మినిట్స్.. ఇలా అన్నీ ఇవ్వాలి. మేడిగడ్డలో కుంగిన ఏడో బ్లాక్‌కు సంబంధించి అడిగిన సమాచారాన్ని అలాగే అన్నారం, సుందిళ్ల సమగ్ర వివరాలను అందజేయండి. అడిగిన సమాచారం లేకపోతే లేదని చెప్పాలి. సగం సమాచారం ఉంటే అదే ఇవ్వండి. ఇవన్నీ సంబంధిత అధికారులు సంతకం చేసి అందజేయాలి. గురువారం ఉదయం మేడిగడ్డ బ్యారేజీ వద్దకు వెళ్లేటప్పటికల్లా ఈ సమాచారం అందుబాటులో ఉండాలి. ప్రాజెక్టు ప్రారంభం నుంచి ఇప్పటివరకు పని చేసిన ఇంజినీర్ల పూర్తి వివరాలు అందజేయండి. ఎవరు ఏ సమయంలో పని చేశారు, ఆ సమయంలో వారి హోదా ఏంటి ఇలా మొత్తం సమాచారం కావాలి. బ్యారేజీల పరిశీలన పూర్తయిన తర్వాత వీరందరితో వేర్వేరుగా సమావేశమై చర్చిస్తాం’’ అని చంద్రశేఖర్ అయ్యర్ చెప్పినట్లు తెలిసింది. ఇందులో క్వాలిటీ కంట్రోల్, నిర్వహణ-మెయింటెనెన్స్, డిజైన్లు.. ఇలా అన్ని విభాగాల ఇంజినీర్ల వివరాలను కోరారు. ‘‘ఎవరి అవసరం ఉన్నా పిలిపించి మాట్లాడతాం. అవసరమైతే మాజీ ఇంజినీర్ ఇన్ చీఫ్ మురళీధర్, కాళేశ్వరం మాజీ ఈఎన్సీ వెంకటేశ్వర్లుతో కూడా మాట్లాడతాం’’ అని ఆయన చెప్పినట్లు తెలిసింది.
మేడిగడ్డ బ్యారేజీ కుంగిన చోట ఓ కన్సల్టెన్సీ సంస్థ చేసిన ఇన్వెస్టిగేషన్ నివేదికలు వచ్చాయా అన్న ప్రశ్నకు మొదట వచ్చాయని, తర్వాత రేపు వస్తాయని ఓ ఇంజినీర్ చెప్పగా.. ‘సమాచారాన్ని ఈ రకంగా దాస్తున్నారు. దాస్తే తక్షణమే చర్యలు తీసుకొంటాం’ అని మంత్రి, కార్యదర్శి ఇద్దరూ హెచ్చరించినట్లు సమాచారం. నిపుణుల కమిటీ బుధవారం రాత్రి వరంగల్‌లో బసచేసి గురు, శుక్రవారాలలో మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను పరిశీలించనుంది.
ఆరు, ఎనిమిదో బ్లాక్‌లలోనూ సమస్య?
మేడిగడ్డ బ్యారేజీలో ఏడో బ్లాక్ కుంగి పియర్స్ దెబ్బతిన్న నేపథ్యంలో రాఫ్ట్ వద్ద, దిగువన పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోవడానికి పార్సన్ అనే సంస్థతో ఇన్వెస్టిగేషన్ చేయించగా, ఈ సంస్థ నివేదిక ఇచ్చినట్లు తెలిసింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఏడో బ్లాక్‌లో రాఫ్ట్ దిగువన ఇసుక మొత్తం కొట్టుకుపోయి ఖాళీ ఏర్పడింది. రెండు వైపులా ఉన్న ఆరు, ఎనిమిదో బ్లాక్‌లలో కూడా కొంత భాగం రాఫ్ట్ దిగువన ఖాళీ ఏర్పడింది. ఈ ఇన్వెస్టిగేషన్ ప్రారంభం కాకముందే బ్యారేజీ ఎగువన, దిగువన భారీ గుంతలాగా ఏర్పడటంతో ఇసుక బస్తాలతో పూడ్చినట్లు సంబంధిత వర్గాల ద్వారా తెలిసింది. ఇందుకోసం సుమారు 30వేల ఇసుక బస్తాలను వినియోగించినట్లు సమాచారం.