Cashless travel in RTC buses-అన్ని రకాల

ఆర్టీసీలోని(RTC) అన్ని రకాల బస్సుల్లో త్వరలో నగదు రహిత చెల్లింపుతో ప్రయాణం చేసే వెసులుబాటు రానుంది. పల్లెవెలుగు, సిటీ ఆర్డినరీ సహా ఆపైస్థాయి బస్సులన్నింట్లో ఐటిఐఎంఎస్(ITIMS) పరికరాలను అందుబాటులోకి తెస్తున్నారు. డెబిట్, క్రెడిట్ కార్డులతోపాటు ఫోన్‌పే, గూగుల్‌పే వంటి వాటితో చెల్లింపులు చేయొచ్చు. ఈ మేరకు బండ్లగూడ బస్‌డిపోను పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశారు. డిపోలోని ఆర్డినరీ, మెట్రో సహా మొత్తం 145 బస్సుల్లో ఐ-టిమ్స్‌ను వాడేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అనంతరం కంటోన్మెంట్ డిపోలో అమలు చేశాక రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 8,300 బస్సుల్లో దశలవారీగా ప్రవేశపెట్టేలా కార్యాచరణ రూపొందించారు.
చిల్లర సమస్యతో టికెట్ ధర పెంపు
ఆర్టీసీ బస్సుల్లో టికెట్ తీసుకునేప్పుడు చిల్లర సమస్యతో కండక్టర్లు, ప్రయాణికుల మధ్య వాగ్వాదాలు జరుగుతుంటాయి. దాంతో ఆర్టీసీ యాజమాన్యం బస్ టికెట్ల ధరలను రూ.10, 15, 20… ఇలా రౌండ్‌ఫిగర్‌గా మార్చేసింది. అయినా సమస్యకు పాక్షికంగా పరిష్కారమే లభించింది. దూరప్రాంత, అధిక ఛార్జీలుండే 700 సూపర్‌లగ్జరీ, ఏసీ బస్సుల్లోనే ఐ-టిమ్స్‌ను ప్రవేశపెట్టగలిగారు. మిగిలిన 8,300 బస్సుల్లో సాధారణ టిమ్స్ మాత్రమే ఉన్నాయి.