#Sport News

Tarun Mannepalli Badminton : విజేత తరుణ్‌ మన్నేపల్లి    


కజకిస్తాన్‌ ఇంటర్నేషనల్‌ చాలెంజ్‌ బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌ పురుషుల సింగిల్స్‌ విభాగంలో హైదరాబాద్‌కు చెందిన తరుణ్‌ మన్నేపల్లి విజేతగా నిలిచాడు. అస్తానాలో శనివారం జరిగిన ఫైనల్లో తరుణ్‌ 21–10, 21–19 స్కోరుతో ఎనిమిదో సీడ్, మలేసియాకు చెందిన సూంగ్‌ జూ విన్‌పై విజయం సాధించాడు. గత ఏడాది జాతీయ చాంపియన్‌షిప్‌లో రన్నరప్‌గా నిలిచిన తరుణ్‌కు ఇదే తొలి అంతర్జాతీయ టైటిల్‌ కావడం విశేషం.

మహిళల సింగిల్స్‌లో భారత షట్లర్‌ అనుపమ ఉపాధ్యాయ టైటిల్‌ సాధించింది. ఫైనల్లో భారత్‌కే చెందిన ఇషారాణి బారువాపై 21–15, 21–16తో అనుపమ గెలుపొందింది. మరో వైపు మిక్స్‌డ్‌ డబుల్స్‌లో హైదరాబాద్‌ అమ్మాయి కె.మనీషా రన్నరప్‌గా నిలిచింది. మనీషా – సంజయ్‌ శ్రీవత్స జోడి ఫైనల్లో 21–9, 7–21, 12–21తో వాంగ్‌ టిన్‌ సి – లిమ్‌ చూ సిన్‌ (మలేసియా) చేతిలో పరాజయంపాలైంది.

 టైటిల్‌ సాధించే క్రమంలో తరుణ్‌ సహచరుడు గగన్‌ బల్యాన్, 2022 వరల్డ్‌ జూనియర్‌ చాంపియన్‌íÙప్‌ రన్నరప్‌ శంకర్‌ ముత్తుసామి, దిమిత్రీ పనరియన్‌ (కజకిస్తాన్‌), ఏడో సీడ్‌ లీ డ్యూక్‌ (వియత్నాం)లను ఓడించాడు.   

Leave a comment

Your email address will not be published. Required fields are marked *