T2o World Cup: భారత్ బంగ్లాదేశ్.. ప్రాక్టీస్ మ్యాచ్ నేడు..

ఐపీఎల్లో భారత ఆటగాళ్లు వేర్వేరు ఫ్రాంఛైజీలకు ఆడారు. ఆయా జట్ల తరపున రాణించారు. ఇప్పుడు టీ20 ప్రపంచకప్‌కు ముందు ఈ ఆటగాళ్లంతా జట్టుగా కలిసేందుకు, సమష్టిగా సత్తాచాటేందుకు చివరి అవకాశం.
న్యూయార్క్: ఐపీఎల్లో భారత ఆటగాళ్లు వేర్వేరు ఫ్రాంఛైజీలకు ఆడారు. ఆయా జట్ల తరపున రాణించారు. ఇప్పుడు టీ20 ప్రపంచకప్‌కు ముందు ఈ ఆటగాళ్లంతా జట్టుగా కలిసేందుకు, సమష్టిగా సత్తాచాటేందుకు చివరి అవకాశం. పొట్టి కప్‌కు ముందు భారత్ ఒకే ఒక్క వార్మప్ మ్యాచ్ ఆడబోతోంది. శనివారం బంగ్లాదేశ్‌తో తలపడుతోంది. ఐపీఎల్ కారణంగా ఆటగాళ్లకు మ్యాచ్ ప్రాక్టీస్ బాగానే లభించింది. అందరూ మంచి లయతోనే ఉన్నారు. ఈ నేపథ్యంలో అమెరికాలోని నాసా కౌంటీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలోని పిచ్, వాతావరణ పరిస్థితులపై అవగాహన పెంచుకోవడం కోసం ఈ వార్మప్ మ్యాచ్‌ను భారత్ ఉపయోగించుకునే అవకాశం ఉంది. పాకిస్థాన్‌తో పోరు సహా ఈ వేదికలోనే భారత్ గ్రూప్ దశలో మూడు మ్యాచ్‌లాడనుంది. బంగ్లాతో వార్మప్ మ్యాచ్‌లో కోహ్లి ఆడతాడా లేదా అన్నదానిపై స్పష్టత లేదు. ఈ మ్యాచ్ ఆరంభానికి ఒక రోజు ముందే అతడు జట్టుతో చేరడమే కారణం. ఈ మ్యాచ్‌తో జట్టు కూర్పుపైనా ఓ అంచనాకు రావాలని కెప్టెన్ రోహిత్, కోచ్ ద్రవిడ్ చూస్తున్నారు. జైస్వాల్నే ఓపెనర్‌గా కొనసాగించాలా? శివమ్ దూబెను తుది జట్టులో ఎక్కడ ఆడించాలి? అనే ప్రశ్నలకు సమాధానం వెతికే అవకాశముంది. మరోవైపు బుమ్రాతో కొత్త బంతి పంచుకునే బౌలర్ ఎవరన్నది కూడా తేల్చాల్సిన అవసరముంది. పేసర్లు అర్ష్‌దీప్, సిరాజ్ రాణించాలని జట్టు ఆశిస్తోంది.
పరిస్థితుల్ని అర్థం చేసుకుంటాం: రోహిత్
న్యూయార్క్: టీ20 ప్రపంచకప్‌కు ముందు బంగ్లాదేశ్‌తో వార్మప్ మ్యాచ్ పరిస్థితుల్ని అర్థం చేసుకునేందుకు ఉపయోగపడుతుందని భారత కెప్టెన్ రోహిత్‌శర్మ అన్నాడు. ‘‘గతంలో ఇక్కడ ఆడలేదు. కాబట్టి పరిస్థితుల్ని అర్థం చేసుకోవడం మాకు అత్యంత ముఖ్యం. జూన్ 5న తొలి మ్యాచ్‌కు ముందు లయను దొరకబుచ్చుకునేందుకు ప్రయత్నిస్తాం. స్టేడియం చాలా అందంగా ఉంది. న్యూయార్క్‌లో తొలిసారిగా జరుగుతున్న ప్రపంచకప్‌ను చూసేందుకు ప్రజలు ఆసక్తిగా ఉన్నారు’’ అని రోహిత్ తెలిపాడు.