T20 World Cup 2024: ఈసారి వరల్డ్ కప్‌లో భారత్ రిస్క్ చేస్తోంది: ఆసీస్ మాజీ కెప్టెన్

పొట్టి కప్ కోసం భారత జట్టు సన్నాహాలను ప్రారంభించింది. జూన్ 1న బంగ్లాదేశ్‌తో వార్మప్ మ్యాచ్‌లో తలపడనుంది. ఇప్పటికే జట్టు సభ్యులందరూ ప్రాక్టీస్‌ను ముమ్మరం చేశారు.
ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచకప్ (T20 World Cup 2024) సంగ్రామం కోసం భారత జట్టు సిద్ధమవుతోంది. జూన్ 5న తొలి మ్యాచ్ ఆడనుంది. 15 మందితో కూడిన స్క్వాడ్‌లో నలుగురు స్పిన్నర్లను ఎంపిక చేసుకుంది. ఇందులో ఇద్దరు స్పిన్ ఆల్‌రౌండర్లు కాగా.. మరో ఇద్దరు స్పెషలిస్టులు. అయితే, ఇలా తీసుకోవడం రిస్క్ చేసినట్లేనని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైకెల్ క్లార్క్ భావించాడు. రెండోసారి విజేతగా నిలుద్దామనే ఆసీస్ ఆశలకు టీమ్‌ఇండియా నుంచి ముప్పు తప్పదని హెచ్చరించాడు.
‘‘భారత్ తన జట్టును ప్రకటించడంతోనే రిస్క్‌కు సిద్ధమైంది. స్పిన్‌నే ఎక్కువగా నమ్ముకుంది. ఆసీస్‌కు భిన్నంగా ఆటగాళ్లను ఎంపిక చేసుకుంది. కరీబియన్ పరిస్థితుల్లో స్పిన్‌ను ఎదుర్కోవడంపైనే భారత జట్టు విజయాలు ఆధారపడి ఉంటాయి. వరల్డ్ కప్‌ను నెగ్గాలనే జట్లకు టీమ్‌ఇండియానే పెద్ద ముప్పు. ఈసారి ఎవరు ఫేవరెట్ అని చెప్పేందుకు కాస్త కష్టంగానే ఉంది. టీమ్‌ఇండియా అందులో ఒకటని చెప్పగలను. ఇప్పటి వరకు ఆ జట్టు పొట్టి ఫార్మాట్‌లో చాలా క్రికెట్ ఆడింది. మిగతా టీమ్‌లతో పోలిస్తే వారి సన్నద్ధత బాగుంది. విండీస్, భారత్ మధ్య పరిస్థితులు భిన్నంగా ఉండొచ్చేమో కానీ.. కొన్ని పోలికలూ ఉన్నాయి. అవి తప్పకుండా భారత క్రికెటర్లకు ఉపయోగకరంగా మారతాయి’’ అని క్లార్క్ తెలిపాడు.
‘యావరేజ్’ వసతులపై ఐసీసీ స్పందన..
భారత క్రికెట్ జట్టు ఇప్పటికే న్యూయార్క్ వేదికగా టీ20 ప్రపంచ కప్ సన్నాహాలను ప్రారంభించింది. ఇక్కడ సరైన సదుపాయాలు కల్పించలేదని వార్తలు వస్తున్నాయి. పిచ్‌ల నుంచి వసతుల వరకూ ఏవీ కూడా సరిగ్గా లేవనేది క్రికెటర్ల అభిప్రాయమని క్రీడా వర్గాలు తెలిపాయి. ఇటువంటి వార్తలపై ఐసీసీ స్పందించింది. ‘‘ప్రాక్టీస్ సదుపాయాలకు సంబంధించి ఇప్పటి వరకు ఎవరి నుంచి ఫిర్యాదులు అందలేదు. ఫెసిలిటీస్ గురించి ఆందోళన తమ వద్దకు రాలేదు’’ అని ఐసీసీ స్పందించింది.
యూఎస్‌కు చేరిన కోహ్లీ..
ఐపీఎల్ 2024 సీజన్ ముగిసిన తర్వాత స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ బ్రేక్ తీసుకున్నాడు. లండన్ వెళ్లినట్లు వార్తలు వచ్చాయి. టీ20 ప్రపంచ కప్ కోసం ఇప్పటికే టీమ్‌ఇండియా అమెరికాకు వచ్చిన సంగతి తెలిసిందే. కోహ్లీ కూడా లండన్ నుంచి స్వదేశానికి వచ్చాడు. ముంబయి నుంచి బయల్దేరి యూఎస్‌లో అడుగు పెట్టేశాడు. దీంతో ‘GOAT’ వచ్చేశాడని.. కోహ్లీ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేస్తున్నారు.